ముందుగా, స్వర్ణా ప్యాలెస్ లో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యులు అయితే వారిని పోలీస్ వారు, కోర్టులు శిక్షిస్తాయి. వాటిని పక్కన పెడితే, వైద్యం రంగం పై కూడా కులం రంగు పులుముతున్న పైశాచికత్వం గురించి మాట్లాడుకుందాం. మనం చదువుకున్న గురువులు ఏ కులమో, ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మనకు ఆపద వస్తే, మంచి హాస్పిటల్ లో కాదో చూస్తాం కానీ, ఆ డాక్టర్ కులం చూడం. సమాజానికి మంచి చేసే నాయకుడిని ఆదరిస్తాం కానీ, కులం చూడం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక వికృత క్రీడ నడుస్తుంది. విజన్ ఉన్న నాయకుడికి కులం అంటగట్టారు. సరే ఇది రాజకీయ ఆటలో ఒక భాగం అనుకుందాం. మన తెలుగు నేల నుంచి కష్టపడి పైకి వచ్చి, అంచెలంచెలుగా, ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి మన తెలుగు వాడు అని గర్వించకుండా కులం అంట గడతాం. అధికారులకు, న్యాయ వ్యవస్థకు కులం అంటగడుతున్నారు. చివరకు ఈ మధ్య విద్యా సంస్థలకు కూడా కులం అంట గడుతున్నారు. ఇప్పుడు మరికొంత ముందుకు వెళ్లి, వైద్య రంగానికి కూడా కులం రంగు పులిమి, పైశాచిక ఆనందం పొందుతున్నారు.

విజయవాడలో కానీ, కోస్తా జిల్లాల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, హార్ట్ స్పెషలిస్ట్ గా డాక్టర్ రమేష్ గుర్తుకు వస్తారు. కానీ ఆయన్ను ఇప్పుడు రమేష్ చౌదరిని చేసి పడేసారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ రమేష్ హాస్పిటల్స్, వచ్చే వాళ్ళు ఏ కులం అని చూసి ఉండరు. వచ్చే వారు కూడా, డాక్టర్ రమేష్ ఏ కులం అని తెలుసుకుని వచ్చి ఉండరు. ఆయనకు మంచి వైద్యుడిగా పేరు ఉంది కాబట్టి వచ్చి ఉంటారు. ఒకప్పుడు వైద్య మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో విస్తృతంగా ఏర్పాటవుతున్న దశలో అందరూ.. హైదరాబాద్‌లో పెడితే ఎలా.. కోస్తాలోనూ ఉండాలని విజయవాడలో ఆయన ఆస్పత్రి పెట్టారు. బహుసా ఇదే ఆయన చేసిన పాపం ఏమో. స్వర్ణా ప్యాలెస్ దుర్ఘటనకు కచ్చితంగా డాక్టర్ రమేష్ కూడా బాధ్యత వచించాలి. ఇది పక్కన పెడితే, ఆయన చౌదరి అంటూ చేస్తున్న వికృత ప్రచారం అభ్యంతరకరం. ఇలా అన్నీ కులం ఆధారంగా చేసుకుంటూ పొతే, దేశం ముందుకు పోతుంటే, మన ఏపి రాష్ట్రము వెనక్కు వెళ్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఎన్నో క్లిష్ట వైద్యాలు చేసిన డాక్టర్లు, ఈ కులం అనే రోగానికి మాత్రం చికిత్స అందించ లేక, వాళ్ళే దానికి బలి అవుతున్నారు. ఈ కులం అనే రోగం, ఇలాగే పాకితే, వైద్యం చెయ్యటానికి కూడా ఏమి మిగలదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read