పిడి అకౌంట్స్ అంటే ఏమిటో జివిఎల్ కు తెలియదా..? పిడి అకౌంట్స్ లో అవినీతి ఏమిటి..? అసలు అకౌంట్స్ లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది..? ఆ మాత్రం ఆర్ధిక పరిజ్ఞానం కూడా లేకుండా రాజ్యసభలో జివిఎల్ ఏం చర్చలు చేస్తారు..? పిడి అకౌంట్స్ కు 2జి స్కామ్ కు పోలిక ఏమిటి..? 2జి స్కామ్ వ్యాపార కార్యక్రమం(బిజినెస్ యాక్టివిటి). పిడి అకౌంట్స్ అనేది ప్రభుత్వ కార్యక్రమం(గవర్నమెంట్ యాక్టివిటి). ఆర్ధిక శాఖ నియంత్రణలో జరిగే గవర్నమెంట్ యాక్టివిటి. పర్సనల్ డిపాజిట్ (పిడి) అకౌంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్సియల్ కోడ్ చాప్టర్ 9లో పేర్కొన్న సివిల్ డిపాజిట్లలో ఒకటి. ఏపిఎఫ్ సి మార్గదర్శకాల ప్రకారం ఆర్ధిక మరియు ప్రణాళికా శాఖ(డబ్ల్యు,ఎం) 22.04.2000న విడుదల చేసిన జివోఎంఎస్ నెం 43 ప్రకారం వీటిని పిడి అకౌంట్లను ఆయా సంస్థల పేర్లతో ప్రారంభిస్తారు, నిర్వహిస్తారే తప్ప వ్యక్తులపేర్లతో జరగవు(జివో ఎంఎస్ నెం 43 తేది 22.4.2000).
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72,652 పిడి ఖాతాలు నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తరువాత కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు 43,374 పిడి అకౌంట్లు మరియు తెలంగాణ రాష్ట్రానికి 29,236 పిడి అకౌంట్లు వచ్చాయి( 24.5.2014న జివో ఎంఎస్ నెం 125). ఈ ఖాతాలలో అత్యధికం పంచాయితీలకు మరియు స్థానిక సంస్థలకు చెందినవే. వాటి స్వంత నిధులు మరియు ఆర్ధిక సంఘం నుంచి,స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ల నుంచి వచ్చే నిధులు కలగలసి పోకుండా ఒక్కో గ్రామ పంచాయితీకి, లేదా ఇతర స్థానిక సంస్థకు 3పిడి ఖాతాలు కేటాయిస్తారు.1)వాటి స్వంత నిధులకు,2)ఆర్ధికసంఘ నిధులకు,3)స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకు. ఈ విధంగా అధికశాతం పిడి ఖాతాలు కేవలం స్థానిక సంస్థలవే. రాష్ట్ర విభజన తరువాత 13వ, 14వ ఆర్ధిక సంఘం నిధులను వేరుచేసేందుకు ఏపి ఫ్రభుత్వం 13,199పిడి ఖాతాలను తెరిచింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13వ,14వ ఆర్ధిక సంఘం నిధులను కలిపేసి 13వ ఆర్ధిక సంఘానికి తెరిచిన పిడి ఖాతాల్లోనే వేస్తోంది.
కాబట్టే తెలంగాణలో పిడి ఖాతాల సంఖ్యలో హెచ్చుదల కనిపించలేదు. ఏజి నివేదిక ప్రకారం ఏపికి చెందిన 57,455 పిడి ఖాతాలలో 31.3.2018నాటికి మొత్తం బ్యాలెన్స్ నిధులు రూ.29,909కోట్లు ఉన్నాయి. పిడి ఖాతాలలో నిధుల పారదర్శకత కోసం కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2014లోనే పిడి అకౌంట్ పోర్టల్ ను ప్రారంభించింది. ఇది వర్ట్యువల్ నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ గా పనిచేయడమే కాకుండా అన్ని పిడి ఖాతాల లావాదేవీలను పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా ఉంచుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 12,822పిడి అకౌంట్లు తొలగించారు. కంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజిమెంట్ సిస్టమ్(సిఎఫ్ ఎంఎస్) కింద 13వ ఆర్ధిక సంఘం మరియు స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ ఎఫ్ సి) గ్రాంట్లకు సంబంధించి వీటిని తొలగించారు.
వాటి పీరియడ్ పూర్తికావడం మరియు వాటిలో నిధులు లేనందున ఆ ఖాతాలను తొలగించడం జరిగింది. నిర్వహణలో ఉన్న పిడి ఖాతాల సంఖ్య ప్రస్తుతం 44,633కు తగ్గాయి. గుజరాత్ తదితర రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో పిడి అకౌంట్లు ఉన్న విషయం ఏజి రిపోర్టును బట్టి తెలుస్తోంది. గుజరాత్ తదితర రాష్ట్రాలలో ట్రెజరీలో కాకుండా బ్యాంకు ఖాతాలలో వేస్తున్నారు. అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నమూనానే అనుసరిస్తున్నాయి. ట్రెజరీలలో కాకుండా బ్యాంకు ఖాతాలలో ఉంచడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతాయి. ఒకవైపు కేంద్రం అన్ని పథకాలకు వేర్వేరు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని ఒత్తిడి చేస్తోంది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే, బ్యాంకుల్లో కాకుండా ట్రెజరీలో నిధులను ఉంచుతున్నాం. ట్రెజరీలో మిగిలిన లావాదేవీల తరహాలోనే పిడి అకౌంట్లను కూడా నిర్వహిస్తున్నారు దీనివల్ల నిధుల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం ఏర్పడింది. నిధుల నిర్వహణలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.( 24.07.2018న జివోఎంఎస్ నెం 112).