వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు. ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల గుండెపోటు రావడంతో వైఎస్ వివేకా స్టెంట్ వేయించుకున్నారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.
కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వివేకానందరెడ్డి చివరిసారిగా కడప జిల్లా చాపాడు మండలం మద్దూరులో వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.30 వరకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయన తనయుడు అశోక్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా పులివెందుల పయనం అయ్యారు. వేకువజామున వాంతులవ్వడంతో బాత్‌రూంలోకి వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు.