జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, కొంత మంది అప్పటి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, విజయసాయి రెడ్డి ఏ1, ఏ2గా అన్ని చార్జ్ షీట్లలో ఉంటే, కొంత మంది మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు వివధ చార్జ్ షీట్లలో ఉన్నారు. 2012 నుంచి జరుగుతున్న ఈ కేసులో, కొంత మంది ఇప్పటికీ విచారణకు హాజరు అవుతూ ఉండగా, మరి కొంత మందికి కోర్ట్ లలో ఊరట లభించింది. మరి కొంత మంది, తమను విచారణ నుంచి తప్పించాలి అంటూ, కోర్ట్ ల్లో పిటీషన్లు వేసారు. తమకు ఈ కేసులో సంబంధం లేదని కొంత మంది, మా పాత్ర పరిమితం అని కొంత మంది, ఇలా కోర్ట్ ల్లో కేసులు వేసారు. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే కోర్ట్ ల్లో ఊరట లభించగా, చాలా మందికి కేసుల్లో భాగస్వామ్యం ఉండటంతో, వారు కోర్ట్ విచారణకు హాజరు కావల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తనని జగన్ అక్రమ ఆస్తుల కేసు నుంచి తప్పించాలి అంటూ, కోర్ట్ లో పిటీషన్ వెయ్యగా, ఆయనకు ఊరట లభించలేదు.
జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, గాలి జనర్ధర్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కూడా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, గనులశాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, తనను ఈ కేసుల నుంచి తప్పించాలని, తన పాత్ర ఈ కేసుల్లో లేదు అంటూ, సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వెయ్యగా, ఆయనకు సుప్రీం కోర్ట్ లో ఊరట లభించలేదు. గనులశాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, సుప్రీం కోర్ట్ లో వేసిన పిటీషన్ పై, న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంలో వీడీ రాజగోపాల్, తనను జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు, గాలి జనర్ధర్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు నుంచి తప్పించాలని, తనకు ఈ కేసులతో సంబంధం లేదని, చెప్తూ, సుప్రీం కోర్ట్ కు విన్నవించుకున్నారు.
అయితే సీబీఐ తరుపు న్యాయవాది ఆకాంక్ష కౌల్ కలగ చేసుకుని, తమకు కౌంటర్ దాఖలు చేసే అవకాసం ఇవ్వాలని కోరగా, సిబిఐ విజ్ఞప్తి మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీం కోర్ట్ 4వారాల సమయం ఇచ్చింది. అయితే ప్రధానంగా, రాజసేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాజగోపాల్ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రఘురాం సిమెంట్స్‌తో పాటు ఓబులాపురం మైనింగ్ కంపెనీ, బళ్లారి ఐరన్ ఓర్ సంస్థలకు గనుల కేటాయింపు విషయంలో రూల్స్ ని అతిక్రమించారన్నది ఆయన పై ఆరోపణ. ఈ అభియోగాలతో జగన్ పై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రాజగోపాల్ ని కూడా సీబీఐ నిందితునిగా చేర్చింది. అయితే, తనను ఈ కేసు నుంచి తప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు.