బెజవాడ నగరంలోకి ఈ-రిక్షాలు ప్రవేశిస్తున్నాయి. వీటికి కూడా ఇక రిజిస్ర్టేషన్ తప్పనిసరి చేయాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా వీటిని నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ ఆటోల మాదిరిగానే వాటికి కూడా రిజిస్ర్టేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. ఈ-రిక్షాలకు అనుమతులు ఇవ్వటంతో పాటు నగరంలో వీటిని తప్పనిసరి చేసే అంశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తోంది. నగరంలో ఈ-రిక్షాలను తప్పనిచేసే ముందు ఆటో యూనియన్ల అభిప్రాయం కూడా తీసుకుని, వారి అంగీకారంతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో రవాణా శాఖ ఉంది. రవాణా రంగ రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలో ఆటోల వ్యవస్థను సంస్కరించి, ఈ-రిక్షాలను ప్రవేశ పెట్టాలన్న ఆలోచనను జిల్లా రవాణా శాఖ చేస్తోంది.
ఈ-రిక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు కూడా పదే పదే చెబుతున్న నేపథ్యంలో, రాజధాని ప్రాంతంలో కీలకమైన విజయవాడ నగరంలో కాలుష్య రహిత సరికొత్త ఆటో వ్యవస్థను తీసుకు రావటానికి ఈ-రిక్షాలను రవాణా శాఖ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. విజయవాడ నగరంలో తిరుగాడే ఆటోల స్థానంలో ఈ-రిక్షాలను ప్రవేశపెట్టడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై అధ్యయనం చేస్తోంది. నగరంలో 30 వేల ఆటోలు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ-రిక్షాలుగా మార్చమని ప్రభుత్వమేమీ నిర్దేశించలేదు. ఉత్తర్వులూ ఇవ్వలేదు. అలాగని రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశించలేదు. అయినప్పటికీ నగరంలో కాలుష్య తీవ్రతను తగ్గించటానికి ఈ-రిక్షాలను తప్పనిసరి చేయాలన్న ఆలోచనతో జిల్లా రవాణా శాఖ ఉంది.
ఆటోవాలాల అభిప్రాయం తీసుకుని, వారి నుంచి వచ్చిన స్పందనను రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకు వెళ్ళి, అమలుకు శ్రీకారం చుట్టాలని డీటీసీ మీరాప్రసాద్ భావిస్తున్నారు. నగరంలో 30 వేల ఆటోలున్నాయి. వీటిలో సీఎన్జీ ఆటోలు ఆరు వేలు ఉన్నాయి. 24 వేల ఆటోలు డీజిల్, పెట్రోల్‌తో నడిచేవే. విజయవాడకు అతి సమీపంలో ఉన్న గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఉన్న పాత ఆటోల స్థానంలో కొత్తగా సీఎన్జీ ఆటోలకు అనుమతులు ఇచ్చారు. వీటిని వెంటనే ఈ-రిక్షాలుగా మార్చడం భావ్యం కాదని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. సీఎన్జీ ఆటోలతో కాలుష్యం ఉండదు కాబట్టి వీటిని మినహాయించాలని భావిస్తున్నారు. 24 వేల పాత ఆటోలను ఈ-రిక్షాలుగా మార్చడం అవసరమని భావిస్తున్నారు.