ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు జరిగిన ముందస్తుల్లోనూ అధికార పార్టీ ఓటమి చవిచూసింది. సాధారణంగా ముందస్తు రెండు రకాలు. ఒకటి: అనివార్యమైన పరిస్థితుల్లో జరిగేది... అంటే వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం రద్దయి, గడువు కంటే ముందు జరపాల్సి రావడం! విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి అధికారంలోని పార్టీలు ముందస్తుకు వెళ్లడం రెండోది. ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌లో రెండూ చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి 1978 దాకా నిరాఘాటంగా- షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టాక- అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి హైకమాండ్‌ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు.

early elections 0692018

కానీ తెలుగుదేశం ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తుగా ఓడింది. టీడీపీ ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపట్టింది. కానీ ఏడాది దాటగానే రాజకీయ సంక్షోభం తలెత్తింది. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు, టీడీపీ జరిపిన ప్రజాస్వామ్య పోరాటం.. ఇవన్నీ దేశ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. ఇందిరాగాంధీ హత్య దరిమిలా సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నప్పటికీ- 1984 డిసెంబరు 14న రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు ఎన్టీఆర్‌ సిఫార్సు చేశారు. 1985లో తిరిగి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది.. తదుపరి 1990 మార్చిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ 4 నెలలు ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1989లో కొలువుదీరింది. 1994లో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి.

early elections 0692018

1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలను కేవలం రెండు నెలల ముందు- అక్టోబరులో జరిపారు. చంద్రబాబు టీడీపీని విజయపథంలో నడిపారు. తనపై నక్సలైట్ల దాడి తరువాత వచ్చిన సానుభూతి ఆశలు రేకెత్తించడంతో 2004 వరకూ అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబరులోనే అసెంబ్లీని రద్దు చేశారు. ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. అప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ జయభేరి మోగించింది. 1969లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రె్‌సలో చీలిక వచ్చింది. మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిరాగాంధీ తొలిసారిగా ముందస్తు ప్రయోగం జరిపారు. రాజభరణాల రద్దు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఒక్క ఓటుతో వీగిపోవడంతో ఆమె ఏడాది ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లారు.

early elections 0692018

గరీబీ హఠావో నినాదంతో వెళ్లి- 352 స్థానాల్లో నెగ్గారు. ఇందిర హత్యానంతరం 1984లో ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ వెంటనే లోక్‌సభకు ఎన్నికలు జరిపించారు. 414 సీట్లతో అఖండ విజయం సాధించారు. 2004లో అప్పటి ఎన్‌డీఏ సారథి, ప్రధాని వాజ్‌పేయి ముందస్తుకు వెళ్లడానికి అయిష్టంగా ఉన్నా- ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ -ముందస్తుకు ప్రేరేపించారు. భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ప్రజల తీర్పు కోరిన బీజేపీ పరాజయం పాలైంది. ఆయనతో పాటు టీడీపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. భావోద్వేగ కారణాలతో జరిగిన ముందస్తు ఎన్నికల్లో విజయాలు సాధించినా- స్వీయ రాజకీయ లబ్ధి కోసం జరిగిన ముందస్తు ఎన్నికల్లో పార్టీలు ఓడిపోయినట్లు చరిత్ర చెబుతోంది.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read