వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఏడాది పాలన పూర్తయిన తరువాత, అసంతృప్తి వాదులు, ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఒక్కో సమస్యతో, ప్రభుత్వాన్ని ఇరుక పెడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఒకరు, అభివృద్ధి చెయ్యలేదని ఒకరు, మాఫియాలు పెరిగిపోతున్నాయని ఒకరు, నాటు సారా ఏరులై పారుతుందని ఒకరు, నీళ్ళు అమ్ముకుంటున్నారు ఒకరు, ఇసుక విధానం పై మరికొంత మంది, ప్రభుత్వ విధానాల పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డి, వినుకొండ ఎమ్మల్యే, ప్రసన్న కుమార్ రెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, డిప్యూటీ సియం మామయ్యా, ఇలా అందరూ గత వారం రోజులుగా సొంత ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తున్నారు. తాజగా ఈ లిస్టులో మరొకరు చేరారు. తూర్పు గోదావరి జిల్లా, కొత్త పేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఇసుక సమస్య పై నిలదీశారు. ఇసుక విధానం సరిగ్గా లేదు అంటూ, తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇసుక సరఫరా చెయ్యటంలో, ఏపీఎండీసీ విఫలమైందని ఎమ్మెల్యే ఆరోపణలు చేసారు. కోనసీమలో, చుట్టూ ఇసుక ఉన్నా, ఇంటి నిర్మాణానికి ఇసుక దొరకటం లేదని అన్నారు.
నిబంధనలు ప్రకారం, అడిగిన వారికి ఇసుక ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. కోనసీమలో మొత్తం 10 ఇసుక ర్యాంపులు ఉండగా, ఒక్కదాన్ని కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదని ఆయన అన్నారు. తాను స్వయానా లేఖ ఇచ్చినా, అడిగినా, కనీసం రెండు ట్రక్కులు ఇసుక కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మూడు రోజుల క్రితం, 14 వేలతో ఆన్లైన్ ఆర్డర్ చేసినా, ఇప్పటికీ ఇసుక సరఫరా చెయ్యలేక పోయారని ఆరోపించారు. వీళ్ళ వ్యవహారం పై, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి ఫిర్యాదు చేసానని ఎమ్మెల్యే అన్నారు. అలాగే బ్రిక్ ఇండస్ట్రీ విషయంలో, ఆ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం, సబ్సిడీల కింద 8 లక్షలు ఇస్తుంటే, అదనీ ఇదనీ, నిబంధాలు సాకుగా చెప్పి, అధికారులు, ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అలాగే తమ పంట పొలాల్లో ఉన్న మట్టిని రైతులు, తరలించుకుంటుంటే, వారి పై కూడా పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇదేమి పధ్ధతి అంటూ ఫైర్ అయ్యారు.