ఆయన ఒక జిల్లాకు సబ్‌కలెక్టర్. చాలా మంది ఐఏఎస్ ల లాగా, తన అధికారం చూపించలేదు. ఐఏఎస్ అంటే ప్రజా సేవ చెయ్యటమే అని నిరూపించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, గురువారం మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ పరిధిలోని బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అదే సమయంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని నూకలేటివాడ గ్రామం నుంచి ఫీడర్ అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అక్కడి నుంచి తీసుకురావల్సి ఉంది. దీంతో సబ్‌కలెక్టర్ స్వయంగా అంబులెన్సును నడుపుకుంటూ ఆ గ్రామానికి వెళ్లారు. రోగిని వాహనంలో ఎక్కించి తనవెంట వచ్చిన అంబులెన్స్ పైలెట్ ద్వారా ఆసుపత్రికి పంపించారు.
ఎక్కడన్నా చిన్న తప్పు జరిగితే, ఎత్తి చూపే న్యూస్ చానల్స్ , సోషల్ మీడియా ట్రోల్స్ వాళ్ళకి, ఇలాంటివి కనిపించవు. కనిపించినా, ఇలాంటి మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే, ఇక్కడ కూడా రాజకీయ కోణం. అంతే కాని, ఒక యువ ఐఎస్ఎస్ ఆఫీసర్ చేసిన పనిని అభినందిస్తున్నాం అనే స్పృహ ఉండదు. ఒక, సబ్‌కలెక్టర్, స్వయంగా ఫీడర్ అంబులెన్స్ నడుపుకుంటూ మన్యంలోని మారుమూల గ్రామంలోని రోగి ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి దగ్గరుండి రోగిని ఆ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి పంపించారంటే, కచ్చితంగా అభినందించాలి. ఇలాంటి వారు ఎంతో మంది అధికారులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి.
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య కేంద్రాలకు వచ్చేలోగా ప్రసవాలు సంభవించడం, మాతా శిశు మరణాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చంద్రన్న సంచార చికిత్స, 108 వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొండ ప్రాంతాల్లో, కొన్ని ఇరుకుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో చేసేదిలేక వైద్యసేవల కోసం డోలీ కట్టుకుని స్థానికులే ఆరోగ్య కేంద్రాలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఫీడర్ అంబులెన్సుల్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతగా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు గాను ద్విచక్ర వాహనాలతో అనుసంధానమై ఉండే 122 ఫీడర్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు.