కేంద్ర ఎన్నికల సంఘం చేసే ప్రతి బదిలీకి కారణాలు చెప్పలేమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి బదిలీకి కారణాలేమీ చెప్పదన్నారు. అధికారులపై ఆరోపణలు ఉన్నా లేకపోయినా బదిలీలు చేసుకోవచ్చని చెప్పారు.గురువారం ద్వివేది మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 నెలలకే అధికారులను బదిలీ చేసిన సంఘటనలున్నాయని.. ఈసీ చేసిన ఎస్పీల బదిలీకి కారణాలు అవసరం లేదని చెప్పారు. సాధారణ రోజుల్లో జరిగే బదిలీలకు ప్రభుత్వాలు ప్రత్యేకించి ఎలాంటి కారణాలు చెప్పవు కదా? అని వ్యాఖ్యానించారు. ఎస్పీలను ఈసీ కేవలం బదిలీ మాత్రమే చేసిందని, అది శిక్ష కాదని స్పష్టం చేశారు.
ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంను బదిలీ చేసింది ఈసీ అయితే తనకు లేఖ రాసి ఏం ప్రయోజనమని ద్వివేది ప్రశ్నించారు. రాష్ట్రంలోని పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఈసీ తనకు ఉత్తర్వులు పంపిందని.. వాటిని తాను సీఎస్‌కు పంపానని చెప్పారు. ఎస్పీలిద్దరూ రాసిన లేఖలు తనకు అందలేదని.. అందితే వాటిని సీఈసీకి పంపుతానని తెలిపారు. రాష్ట్రంలోని పోలీసులపై వైసీపీ ఆరోపణలను ఈసీ పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగి ఉండేదని, బదిలీలకు అదొక్కటే కారణమై ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఎస్పీలు, అదనపు డీజీలను బదిలీ చేసేటప్పుడు తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, కచ్చితంగా జరపాల్సిన నిబంధన కూడా ఏదీ లేదని వెల్లడించారు.
సిట్‌కు సహకరిస్తున్నాం.. డేటా చోరీ, ఫాం-7పై వేసిన సిట్ బృందాలకు సహకరిస్తున్నామని, అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ వివరణలు ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ, ప్రజాశాంతి పార్టీ గుర్తులు ఒకేలా ఉన్నా యని, ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్చాలంటూ వచ్చిన ఫిర్యాదులపై ద్వివేది స్పందించారు. ఏ పార్టీకైనా ఇప్పుడు గుర్తులు మార్చ డం వీలుకాదని స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు భద్రత పెంచమని పోలీసులకు సూచించామన్నారు. జగన్, విజయ్‌సాయిరెడ్డిల బెయిల్ రద్దు అంశం తమ పరిధిలో లేదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు