రాష్టంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సమీక్ష నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ వెల్లడించారు. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్ బ్యాలెట్ వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్ విడుదల చేస్తాం’" అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అన్నారు.
ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి కొనసాగుతుందని రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కొనసాగుతారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న హింసాత్మక చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. కొన్నిచోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగడం దారుణమని వ్యాఖ్యానించింది. విధుల్లో విఫలమైన పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నామని వెల్లడించింది. శ్రీకాళహస్తి, పలమనేరు, డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని... తిరుపతి, పలమనేరు, రాయదుర్గం , తాడిపత్రి సీఐలు బదిలీ చేయాలని సూచించింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. అవసరమైతే ఈ ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది.
అయితే, ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ చూస్తే, కరోనా ఒక సాకుగానే కనిపిస్తుంది. కరోనా పట్ల కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో సందేహం లేదు. అయితే, ఇదే ప్రెస్ మీట్ లో, ఈసీ, ఏకంగా, గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పించటం. శ్రీకాళహస్తి, పలమనేరు, డీఎస్పీలను బదిలీ, మాచర్ల సీఐను సస్పెండ్, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం , తాడిపత్రి సీఐలు బదిలీ వంటి విషయాలు ఈసీ చెప్పటం, ఒక సంచలనం. ఎంత అరాచకం లేకపోతే, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని మాధ్యమాల్లో ఈ అరాచకాలు వస్తున్నాయి, ఒక వేళ ఈసీ చర్యలు తీసుకోకపొతే, కోర్ట్ లు దగ్గర భంగపాటు తప్పదు. అందుకే ముందుగానే ఈ అరాచకాలు చూసిన ఈసీ, చర్యలు తీసుకోకపొతే, ఇంకా ఎందుకు అనుకుని, వారు ఈ చర్యలు తీసుకున్నారు.