ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా 45 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సెక్షన్ 120బి.419, 420, 465, 471 ఐపీసీ సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 66డి, సెక్షన్ 31 ఆర్పీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీకాకుళం 3, తూ.గో 14, కృష్ణా 3, గుంటూరు 1, ప్రకాశం 4, చిత్తూరు 3, అనంతపురం 1, కర్నూలు 8, విశాఖ జిల్లాలో 8 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని సీఈవో స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో ఫాం.7 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఐపీ అడ్రస్లు సేకరిస్తున్నామని, విచారణ జరపాలని పోలీస్ శాఖను కోరామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మీ సేవా సిబ్బంది హస్తం ఉందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, అనుచరుల ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్రపన్నిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఓట్ల తొలగింపు విషయం పై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ టీమ్ ఓట్ల తొలగింపు నెట్వర్క్ చేపట్టి పెద్ద దందా చేస్తుందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. గతంలో తెలంగాణాలో గుట్టుచప్పుడు లేకుండా ఓట్లు తొలగించినట్లుగానే ఆంధ్రాలో కూడా తొలగింపు కార్యక్రమం చేపట్టారన్నారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేస్తున్నవారె వరో కూడా తెలియకుండా ఆన్లైన్లో ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తుంది కూడా తెలియకుండా ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంద న్నారు. ఈ తొలగింపులు ఎక్కువగా టీడీపీ నాయకుల ఓట్లతోపాటు టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కూడా గల్లంతు అవుతున్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల్లో ఓటమి భయం తోనే వైసీపీ ఇలాంటి బోగస్ ఓట్ల చేర్పుల కార్య క్రమానికి శ్రీకారం చుట్టి టీడీపీ ఓట్లను తొలగిస్తుం దని తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు టిడిపి నేతలు చెప్పారు. ఓట్ల తొలగింపు కుట్ర చేస్తున్నవారిని వదలవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి లోకేష్ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ప్రతి గ్రామంలోనూ టీడీపీ ఓట్లను తొలగించేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. బిహార్ గ్యాంగ్ డైరెక్షన్లో దొంగబ్బాయి. చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో టీడీపీని ఎదుర్కొనే దమ్ములేకే వైసీపీ దద్దమ్మ పనులు చేస్తోందని లోకేష్ దుయ్యబట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించారని, దీని వెనుక ఉన్న కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని చంద్రగిరి టీడీడీ నేత నాని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో గతంలో ఉన్న ఓట్లు, తాజా ఓటర్ల లిస్టులో తొలగించిన తర్వాత ఓటర్ లిస్టులను ఆయన మీడియాకు చూపించారు. ప్రతి మండలంలోనూ టీడీపీ ఓటర్లను కుట్రపూరితంగా తొలగించారని, సైబర్ నేరానికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.