కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో 21విపక్ష పార్టీల నేతల భేటీ ముగిసింది. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చించిన ఎన్డీయేతర పార్టీల నేతల బృందం ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల లెక్కింపులో తేడావస్తే నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీ సందర్భంగా 8 పేజీల మెమోరాండాన్ని నేతలు సీఈసీకి అందజేశారు. ఈ మెమోరాండంలో పలు అంశాలను కీలకంగా పొందుపరిచారు. ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5వీవీప్యాట్లు లెక్కించాలని ఇప్పటికే ఆదేశించిందని నేతలు గుర్తుచేశారు.
చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు పూర్తికాకుండానే వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. లెక్కింపు ముగిసే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉంచాలని కోరినట్టు తెలుస్తోంది. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సరైన మార్గదర్శకాలను రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ అధికారులకు ఇవ్వకపోవడాన్ని విపక్ష నేతలు సీరియస్‌గా ప్రస్తావించినట్టు సమాచారం. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని, వీవీప్యాట్లు లెక్కించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెనకడుగు వేయడానికి కారణాలేంటని నిలదీసినట్టు సమాచారం. వీవీప్యాట్ల కౌంటింగ్‌లో ఎందుకు ఇప్పటివరకు నియమనిబంధనల్ని రూపొందించలేదని ప్రశ్నించాయి.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఐదు వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతోందని నిలదీసినట్టు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో జరిగిన ఎన్నికల నిర్వహణలో విఫలమైందని, విపక్షాలు లేవనెత్తిన ఏ ముఖ్యమైన అంశాన్నైనా ఎందుకు పట్టించుకోలేదని తీవ్రంగా ప్రశ్నిస్తూ నేతలు నిరసన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఎండగడుతూ తమ వాదనను విన్పించిన విపక్షాల నేతలు ఎలాంటి కార్యాచరణను ప్రకటిస్తారో చూడాలి.