షెడ్యూలు ప్రకటించక ముందే కేంద్ర ఎన్నికల కమిషన్ తన అధికారులను ఏపి ప్రభుత్వం పై చూపించింది. కోడ్ రాకముందే ఇలా ఎందుకు దూకుడు ప్రదర్శించిందో, ఎవరి ఒత్తిడితో చేసిందో ఎవరికీ అర్ధం కాలేదు. పట్టుపట్టి మరీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ రామారావును బదిలీ చేయించింది. జిల్లా కలెక్టర్‌గా ఆయన ఈనెల 9న బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే ఆకస్మికంగా బదిలీ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీనికి కారణాలేమిటని ఆరా తీసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సీఈసీ సునీల్ అరోరా ఈనెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, పోలింగ్ సిబ్బంది అందుబాటు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్లు తమ జిల్లాల్లో పరిస్థితిపై ప్రజంటేషన్ ఇచ్చారు. కానీ... శ్రీకాకుళం కలెక్టర్ రామారావు తన ప్రజంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయారు. దీనిపై అప్పుడే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు రోజులే అయ్యిందని, వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకుంటానని రామారావు వివరణ ఇచ్చారు. అయినా ఈసీ సంతృప్తి చెందలేదు. ఢిల్లీకి వెళ్లగానే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ‘శ్రీకాకుళం కలెక్టర్ పని తీరు బాగలేదు. అక్కడ మరొకరిని నియమించండి’ అని సూచించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టినందునే సరిగ్గా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారని ప్రభుత్వం వివరించింది. అయినా... ఈసీ పట్టించుకోలేదు. ‘కలెక్టర్‌ను మార్చాల్సిందే’ అని పేర్కొంది. ఈసీతో ఘర్షణ ఎందుకనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి... ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు ముగ్గురు పేర్లతో జాబితా పంపాలని ఈసీ కోరింది. నిజానికి... ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కలెక్టర్ లేదా ఎస్పీని మార్చాల్సి వస్తేనే ఈసీకి ఇలాంటి అధికారం ఉంటుంది. కానీ... ఇప్పటి నుంచే ఈసీ ఈ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపగా... విజయవాడ కమిషనర్‌గా ఉన్న నివా్‌సను ఈసీ ఎంపిక చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సిసోడియాను కూడా ఇటీవల ఈసీ మార్చేయడం గమనార్హం. సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని, మరొకరిని నియమించాలని ఈసీ కోరింది. దాంతో ప్రభుత్వం ద్వివేదీని సీఈవోగా నియమించింది. ఇప్పుడు... పరిస్థితిని వివరించినప్పటికీ ఈసీ ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీకాకుళం కలెక్టర్‌ను మార్పించడం గమనార్హం.