లోక్‌సభ ఎన్నికల తో పాటు శాసనసభ ఎన్నికలను నిర్వహించే అవకాశమే లేదని కేంద్ర ఎన్నికల సంఘం మరో సారి స్పష్టం చేసింది. రాజ్యాంగ సవరణ లేకుండా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపి రావత్ గురువారం వెల్లడించారు. జమిలి ఎన్నికల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు రావత్ పైవిధంగా స్పందించారు. భాజపా సారథి అమిత్ షా ఈనెల మొదటి వారంలో, ఒక దేశం…ఒకే ఎన్నిక వుండాలన్న ప్రధాని నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయకమిషన్‌కు లేఖ రాసిన విషయం విధితమే.
జమిలి ఎన్నికలకు ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలను ఆపాదిస్తున్నాయని ఆయన తన ఎనిమిది పేజీల లేఖలో పేర్కొన్నారు. న్యాయపరంగా చర్యలు చేపట్టి చట్టం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని, లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలంటే 14 నెలల ముందుగానే తాము చర్యలు చేపట్టాల్సి వుంటుందని ఎన్నికల కమిషనర్ రావత్ తెలిపారు. ఎన్నికల సంఘానికి కేవలం 400 మంది సిబ్బంది మాత్రమే వన్నారని, ఎన్నికల నిర్వహణకు 1.11 కోట్ల మందిని నియమించాల్సి వుంటుందని ఆయన వివరించారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమయం, ఎన్నికల వ్యయం ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తున్నదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను రెండు దశలలో నిర్వహించాల్సిందిగా న్యాయశాఖ నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలావుండగా, జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, వీటిని నిర్వ హించాలనుకోవడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డిఎంకె, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, జెడి(ఎస్) పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఇంకొక అడుగు ముందుకు వేసి, లోక్‌సభను రద్దు చేసి రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలతో పాటు నిర్వహించాలని సవాలు విసిరింది. ఒక దేశం…ఒకే ఎన్నిక విధానం సరైందేకానీ, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదని భాజపా మిత్రపక్ష నేత నితీష్ కుమార్ పేర్కొన్నారు.