‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నేనే స్థాపించాను. నేను స్థాపించిన పార్టీలోనే నాకు అన్యాయం జరుగుతోంది. నాకు న్యాయం చేయండి’ అని వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివ కుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి టీఆర్‌స్ ను ఓడించాలని శివకుమార్ పిలుపునివ్వడం వైసీపీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దాని పై ఆయన ఒక వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు.
‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ప్రభావితమై ఆయన మరణం తర్వాత 2010లో యువజన శ్రామిక రైతు(వైఎ్‌సఆర్) కాంగ్రెస్ పార్టీని స్థాపించాను. ఎన్నికల కమిషన్ కూడా గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత వైఎస్ తనయుడు జగన్ నాతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు ఈ పార్టీని వినియోగించుకొందామని ప్రతిపాదించారు. నేను అంగీకరించాను. ఆయనను పార్టీ అధ్యక్షునిగా చేశాను. పార్టీ ఆశయాల నుంచి దూరం జరగరాదని, పార్టీ ఉన్నంత కాలం నాకు తగిన గౌరవం ఇవ్వాలని కోరాను. దానికి ఆయన అంగీకరించారు. కానీ ఆకస్మికంగా గత ఏడాది డిసెంబర్ నాలుగో తేదీన నాపై చర్య తీసుకొంటున్నట్లు ఎవరి సంతకం లేకుండా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నోటీస్ పంపలేదు. నా వివరణ కోరలేదు. అన్యాయంగా బయటకు పంపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిపై చర్య తీసుకొనే అధికారం న్యాయబద్ధంగా ఎవరికీ లేదు. అయినా తీసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పదవిని పునరుద్ధరించాలి. తుది నిర్ణయం జరిగే వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా హోదాను పునరుద్ధరించాలి. నాకు న్యాయం చేయాలి’ అని శివకుమార్ తన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.