వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్‌పై మార్చి 11లోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమాని శివకుమార్.. 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. శివకుమార్ మాత్రం వైసీపీలో క్రియా శీలక కార్యకర్తగా కొనసాగారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతివ్వడాన్ని శివకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో వైఎస్ జగన్.. శివకుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్.. ఆ పార్టీ తనదని, తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నేనే స్థాపించాను. నేను స్థాపించిన పార్టీలోనే నాకు అన్యాయం జరుగుతోంది. నాకు న్యాయం చేయండి’ అని శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివ కుమార్‌ను వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి టీఆర్‌స్ ను ఓడించాలని శివకుమార్ పిలుపునివ్వడం వైసీపీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. దాని పై ఆయన ఒక వినతిపత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందచేశారు.
నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నోటీస్ పంపలేదు. నా వివరణ కోరలేదు. అన్యాయంగా బయటకు పంపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిపై చర్య తీసుకొనే అధికారం న్యాయబద్ధంగా ఎవరికీ లేదు. అయినా తీసుకొన్నారు. దీనిపై విచారణ జరిపి వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా నా పదవిని పునరుద్ధరించాలి. తుది నిర్ణయం జరిగే వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా హోదాను పునరుద్ధరించాలి. నాకు న్యాయం చేయాలి’ అని శివకుమార్ తన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు పంపించింది. మరి దీని పై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి...