ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి సమీక్షలు కానీ వీడియో కాన్ఫిరెన్స్ లు కానీ చేయడానికి వీలులేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గత రెండు రోజులుగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, హోంశాఖల మీద సమీక్షలు చేయగా వాటి కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయగా ఈసీ ఈ ఆదేశాలు జారీచేసింది. రెండు రోజులుగా చేసిన సమీక్షలు కూడా ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. అయన చేసిన సమీక్షలను కూడా ఈసీ రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబునాయుడు రద్దు చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికారులకు మరోసారి ఎన్నికల నియమావళిని ఈసీ పంపించింది. వైసీపీ ముఖ్యనేతలు ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మరోసారి కలిశారు.
చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించరాదని, కానీ చంద్రబాబు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అధికారిక భవనాల్లో సమావేశాలు పెట్టకూడదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోడ్ చెబుతోందని, కానీ చంద్రబాబు అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ద్వివేదీకి వివరించారు. తన చర్యల ద్వారా అధికారులను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. వాళ్ళు కలిసిన వెంటనే, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫిర్యాదు చేసిన మేరకు సీఈసీ నివేదిక కోరింది. రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదికను గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ద్వివేది పేర్కొన్నారు. ఈనెల 10న చంద్రబాబు-ద్వివేది మధ్య జరిగిన సంభాషణ వీడియోను... ఇంగ్లిష్‌లోకి అనువదించి సీఈసీకి ద్వివేది పంపారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికలే తమకు ఆధారమని, కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపులో ఆలస్యంపై... మరోసారి కలెక్టర్‌ను నివేదిక కోరతామని ద్వివేది స్పష్టం చేశారు.