ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ , ఏబీ వెంకటేశ్వరరావును హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌లో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కడప, శ్రీకాకుళం ఎస్పీలు తమ తర్వాత ఉండే అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ వెల్లడించింది. ఇరువురు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టులు చేయాలని, ఎలాంటి ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి సమాచారం అందించే, ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్ చీఫ్‌కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదనీ, సీఎస్‌తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారనీ, అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందనీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కడప ఎస్పీపైనైతే ఫిర్యాదే లేదని గుర్తుచేస్తున్నాయి. సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో సన్నిహిత బంధువులపైనే అనుమానాలు తలెత్తడం, దీనిపై సిట్ విచారణ కీలక దశకు చేరి, అరెస్టులకు రంగం సిద్ధమైన తరుణంలో, నేరుగా ఎలాంటి ఆరోపణలు లేని కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను బదిలీ చేయడం విచిత్రంగా ఉందని తెలిపాయి. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వైసీపీ చేసిన నిరాధార ఆరోపణను పరిగణనలో తీసుకొని ఈసీ బదిలీ చేసిందని వివరించాయి.
వైసీపీ అధ్యక్షుడు జగన్ గత నెలలో, వైసీపీ ముఖ్య నాయకులు విజయ్‌సాయిరెడ్డి గత శుక్రవారం, సాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తు సరిగా లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి, వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ అధికారి పోలీసు అధికారి యోగానంద్, చిత్తూరు, ప్రకాశం విజయనగరం ఎస్పీలు, తదితర పలువురు అధికారులపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.