తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి పై గత నెలలో ఈడీ రైడ్లు చేసి, హడావిడి చేసిన విషయం తెలిసిందే. 6 వేల కోట్లు అని, ఫారెన్ కార్లు అంటూ, మీడియాకు లీకులు ఇచ్చి, హడావిడి చేసారు. దీని పై, అన్ని పత్రాలతో మీడియా ముందుకు వచ్చి, సుజనా వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఈడీ దాడులు తరువాత, డిసెంబర్ 3 నుంచి 5 వరకు, ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ లో సుజనాని విచారణ జరిపారు. అయితే ఈ మూడు రోజులు సుజనాని 8 గంటల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కనీసం ఆహారం కూడా అందించలేదని ఆయన తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు బుధవారం నివేదించారు.

sujana 20122018 2

ఎంపీని తన భోజనం తెచ్చుకోవడానికి కూడా అనుమతించలేదని, ఆయనకున్న మానవ హక్కులను ఉల్లంఘించారని జస్టిస్‌ నజ్మీ వజీరీ ఎదుట వాదనలు వినిపించారు. సుజనా చౌదరిపై నిర్బంధంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు అతిక్రమించారని, ఆయన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. ఈడీ విచారణ సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ 8 వరకూ ఆయనను వెళ్లనీయలేదని తెలిపారు. తొలిరోజు ఇద్దరు ఈడీ అధికారులతో కలిపి మధ్యాహ్న భోజనానికి వెళ్లగా, మిగిలిన రెండు రోజులు భోజనానికి అనుమతించలేదని చెప్పారు.

sujana 20122018 3

అలా జరిగి ఉంటే అది మానవహక్కులు, హుందాతనం, రాజ్యాంగ హక్కులను అతిక్రమించడమే అవుతుందని; ఈ విషయాన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా ఈ ఆరోపణలను ఈడీ తరఫున హాజరైన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. ఆయన అరటి పళ్లు తిన్నారని తెలిపారు. ఈ విషయమై ప్రమాణపత్రం దాఖలు చేస్తామని ఎంపీ తరఫు న్యాయవాదులు తెలపగా దీనికి సమాధానమివ్వాల్సిందిగా న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఈడీ విచారణ కోసం తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ సుజనా దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పట్ల ఈడీ ఎలాంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదంటూ గతంలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో డిసెంబరు 3, 4, 5 తేదీల్లో ఈడీ విచారణకు సుజనా హాజరయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read