అక్రమాస్తుల కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోడీ, కేసీఆర్ ల జోడీ ఎలా రక్షిస్తోందో ఒక్క లేఖ బట్టబయలు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకి 2017లో రాసిన లేఖ బయటపడి కలకలం రేపుతోంది. అడుగడుగునా అక్రమాలతో కోట్లు కొల్లగొట్టిన జగన్ క్విడ్ ప్రోకో పక్కా ప్రణాళిక ప్రకారం ఎలా అమలు అయ్యిందో లేఖలో ఈడీ డైరెక్టర్ ఆధారాలతో సహా పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలంటూ సీబీఐని కోరారు. ప్రస్తుతం కాక పుట్టిస్తున్న ఈ లేఖపై సీబీఐ పట్టించుకోకపోవడం వెనుక మోడీకి జగన్ లొంగిపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తనయుడు జగన్ కోసం చేసిన ఈ అక్రమ భూకేటాయింపులను తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయకపోవడమూ అనుమానాలకు తావిస్తోంది.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ మే 30, 2017 తేదీన , సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకి రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖలో భూకేటాయింపుల కోసం తొక్కిన అడ్డదారులు, జగన్ కు మేలు చేకూర్చేందుకు వేసిన ఎత్తులన్నీ వివరించారు. కూకట్ పల్లిలో హిందూజా గ్రూపు సంస్ధ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ `నాలెడ్జ్ పార్క్’ కోసం 100 ఎకరాలు కేటాయించాలని 2005 నుంచి కోరుతూ వస్తోంది. అయితే 2009 ఎన్నికలకు ముందు సీ.ఎం. వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నీ నిబంధనలను తుంగలో తొక్కి మరీ 100 ఎకరాలు కేటాయింపులు చేశారు. ఈ అడ్డగోలు జీవో తీగలాగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ క్విడ్ ప్రోకో గుట్టురట్టు చేసింది. తాము కోరుకున్న వంద ఎకరాలకు ప్రతిఫలంగా జగన్ కి 11 ఎకరాల భూమి తమ సొమ్ముతోనే కట్టబెట్టిన హిందూజా గ్రూప్ వ్యవహారం ఈడీ బట్టబయలుచేసింది. తమ భూమి, తమ డబ్బుతో కొని జగన్ కు అమ్మినట్టు డ్రామా క్రియేట్ చేయాల్సిన దుస్థితి హిందూజా గ్రూప్ నకు ఎలా ఏర్పడిందో ఈడీ డైరెక్టర్ ఆధారాలతో సహా సీబీఐకి పంపారు.
ఏపీ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రహారీ గోడ కట్టారని, 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చి గడువు తీరకముందే ప్రొక్లయినర్లతో కూల్చేసిన ఘనమైన తెలంగాణ ప్రభుత్వం.. వందల కోట్ల ప్రజాధనం జగన్ భూదాహానికి కరిగిపోయినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు సంబంధంలేని డేటాని, వైకాపా ఫిర్యాదుతో జగన్ కి మేలు చేకూర్చేందుకు చోరీ చేసిన తెలంగాణ సర్కారు...అదే తెలంగాణా నడగడ్డలో వందల ఎకరాల భూములు మింగేసినా స్పందించకపోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ అక్రమంగా భూములు కేటాయించారనీ తెలుసు. భూములన్నీ క్విడ్ ప్రోక్వోలో జగన్ కే చేరాయని ఈడీ డైరెక్టర్ లేఖ స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు చేసి నిర్దారించింది. అయినా కేసీఆర్ వైఎస్ హయాంలో జరిగిన భూ విందులపై విచారణకూ ఆదేశించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య ఒప్పందంలో భాగంగానే అక్రమాస్తుల నిందితుడిని శిక్షించాల్సింది పోయి, రక్షిస్తున్నారని ఈ లేఖ ద్వారా మరోసారి వెల్లడైంది.