సీఎం చంద్రబాబు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారిగా పోర్టులను తీసుకున్న ఆయన గెలుపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీఎల్పీ సమావేశంలో వెల్లడించారు. అయితే తాను కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సి ఉందని, ఆ పక్రియ ముగిశాక అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంపై కూడా ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. నెల రోజుల పాటు తనకు సమయం ఉంటుందన్నారు. ఆ సమయంలో ప్రతి రోజు రెండు జిల్లాల్లో పర్యటించడం.. లేదా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం... లేకపోతే బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు సమాచారం.
నెల రోజుల ప్రచారంపై ఎమ్మెల్యే అభిప్రాయాలను తీసుకున్నారు. మీరు కూడా ఆలోచించాలని, మీరు ఎలా చెబితే అలా చేస్తామని వారికి చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంపై రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని నేతలను సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేది నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ షెడ్యూల్ ఉంటుందని, ఆ తర్వాత మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో షెడ్యూల్ వల్ల ఎలాంటి కార్యక్రమాలను చేసేందుకు వీలుండదని అందువల్ల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
ఫిబ్రవరి 2,3,4 తేదీలలో పించన్ల పండుగ జరపాలని చంద్రబాబు ఆదేశించారు. ఫిబ్రవరి 5న రైతుల సమస్యలపై చర్చ.. తర్వాత ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని చంద్రబాబు పేర్కొన్నారు. 9న 4లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామన్నారు. 17 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామని, మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. 22 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, కొత్తగా 14 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. వీటన్నింటిని శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత, కాపు రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.