ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అన్ని కేసుల్లో బెయిల్ రావటంతో, ఆయన ఈ రోజు విడుదల కానున్నారు. ఈ నేపధ్యంలో, 66 రోజులు తరువాత వస్తున్న తమ నేతకు, భారీ స్వాగతం పలకటానికి, తెలుగుదేశం కార్యకర్తలు, చింతమనేని అభిమానులు సిద్ధం అయ్యారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులు తట్టుకుని, వైసిపీ పై పోరాటానికి సిద్ధం అవుతున్న, తమ నేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధం అయ్యాయి. అయితే, పోలీసులు మాత్రం, వీరి ఆశల పై నీళ్ళు చల్లారు. తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా, శనివారం నుంచి నవంబర్ 30 వరకు, పోలీస్ ఆక్ట్ 30 అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ ఆక్ట్ అమల్లో ఉంటే, సభలు కాని, ర్యాలీలు కాని, బహిరంగ నినాదాలు కాని నిషిద్దం అని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ ఆక్ట్ అమలులో ఉండగా ఎవరైనా, అవి ఉల్లంఘిస్తే, వారి పై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, దీని పై తెలుగుదేశం శ్రేణులు భగ్గు మంటున్నాయి. మేము ఏమి ఆందోళనలు, అల్లర్లు చెయ్యటానికి రావటం లేదని, అన్యాయంగా ఇరికించి, రెండు నెలలు జైల్లో ఉంచిన మా నేత పోరాట పటిమకు, అండదండలు ఇవ్వటానికి వస్తున్నామని, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, చింతమనేనికి ఘన స్వాగతం పలుకుతామని అంటున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి, అవినీతి చేసిన కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై వస్తేనే, అంత హడావిడి చేసారని, ఇక్కడ చిన్న చిన్న కేసులు పెట్టి, జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం, ఇవేమీ కుదరవని, ఆక్ట్ ప్రకారం నడవాల్సిందే అని అంటున్నారు. మరి, టిడిపి శ్రేణులు వెనక్కు తగ్గుతాయో లేదో చూడాలి.
మరో పక్క శనివారం చింతమనేని ప్రభాకర్ పై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులలో ఏలూరు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు 18 కేసుల్లో చింతమనేనికి బెయిల్ మంజూరు అయ్యింది. 66 రోజుల తరువాత, ఆయన బయటకు రానున్నారు. ఆయన పై దాడి కేసు, ఎస్సీ, ఎస్టీ కేసులు లాంటివి పెట్టి, 66 రోజులు జిలో ఉంచారు. ఈ క్రమంలో శనివారం, నాలుగు కేసుల్లో, ఏలూరు న్యాయస్థానం జిల్లా న్యాయమూర్తి కె.సునీత బైలు ఇస్తూ, శుక్రవారం చింతమనేనికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. రూ. 50 వేల పూచీకత్తు చొప్పున ఇద్దరు షురిటీ దారులు శనివారం సమర్పించాక ఆయన విడుదలకు కానున్నారు. శనివారం మూడు గంటల ప్రాంతంలో చింతమనేని విడుదల కానున్నారు.