ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సి పైన రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. సహజంగా సమాజంలో ఉద్యోగులు పట్ల అంత సానుభూతి ప్రజల్లో లేదు. అయతే ఇక్కడ మాత్రం, ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ప్రజలు నమ్మారు. అందుకే వారి ఉద్యమానికి మద్దతు తెలపటం చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల జీతాలు తగ్గటం, రికవరీ చేయటం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఉద్యోగ సంఘాల నేతలు, మొదట నుంచి, మూడు డిమాండ్లు వినిపిస్తూ వచ్చారు. ఇవి ఒప్పుకుంటేనే చర్చలు అన్నారు. అసితోష్ మిశ్రా కమిటీ నివేదిక బయట పెట్టటం, రెండోది పీఆర్సీ జీవోల రద్దు, మూడు పాత జీతాలు వేయటం. అయితే శనివారం వరకు ఈ మూడు డిమాండ్ల పై ఉద్యోగ సంఘ నాయకులు గట్టిగా ఉన్నారు. చలో విజయవాడ కార్యక్రమం తరువాత కూడా ఇదే విషయం చెప్పారు. అయితే శుక్రవారం రాత్రి నుంచి సీన్ మారిపోయింది. ఈ మూడు డిమాండ్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేక పోయినా, ఉద్యోగ సంఘ నాయకులు చర్చలకు వెళ్ళిపోయారు. అలా ఎందుకు వెళ్ళారు అంటే, పెద్ద కధే వినిపిస్తుంది. చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అవ్వటంతో, ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇంటలిజెన్స్ రిపోర్ట్ చూసి ఉలిక్కిపడ్డారు.
దీంతో ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఆ ఇంపాక్ట్ వేరే రకంగా ఉంటుందనే అంచనాకు వచ్చారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, దీనికి ముగింపు పలకాలని డిసైడ్ అయ్యారు. అంతే ఉద్యోగ సంఘాల నేతలను లైన్ లోకి తీసుకు రావటానికి, ఒక మంత్రి రంగంలోకి దిగారు. అలాగే ఒక ప్రభుత్వ పెద్ద కూడా సహకరించారు. ఏ ఉద్యోగి సంఘ నాయకుడి మీదకు ఎవరిని ప్రయోగించాలో స్కెచ్ వేసారు. అలాగే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసారు. అంతే మూడు షరతులు గాల్లో కలిసిపోయాయి. నలుగురు ఉద్యోగ సంఘ నాయకులూ, మంత్రుల కమిటీ ముందు వాలిపోయారు. ఇక శనివారం నుంచి అయితే, చర్చలు అవ్వకుండానే, వాళ్ళు ఒప్పేసుకున్నారు అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు. అసలు చర్చలకంటే ముందే, ఈ చర్చలు సఫలం అవుతాయి అనే వాతావరణం బయట కల్పించారు. చివరకు ఆ మూడు డిమాండ్లు మత్రమే కాదు, ఏది అవ్వలేదు. పీఆర్సి సాధన కమిటీ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, పీఆర్సి సాధించకుండానే కధ సమాప్తం అయ్యింది. ఏమయ్యిందో, ఆ నలుగురుకే తెలియాలి మరి.