నిర్దేశిత సమయం దాటిన తరువాత జరిగిన పోలింగ్ ఎవరికి మేలు చేస్తుందనే అంశంపై ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తున్నాయి. పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత అనేకచోట్ల పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకూ కొనసాగింది. ఈ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం విశేషం. ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి? వాటి వల్ల ఎవరు లబ్ధి పొందుతారనే అంశంపై ఇప్పుడు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో సాయంత్రం ఆరు గంటల సమయానికి 66.47 శాతం పోలింగ్ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భాస్కర్ ప్రకటించారు. అప్పటికే క్యూలో నిల్చొన్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తామని, ఎంత రాత్రయినా పోలింగ్ కేంద్రాలు తెరిచే ఉంచుతామన్నారు.
ఆ మాట మేరకు రాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా ఓటింగ్ అవకాశం ఇచ్చారు. అంతా పూర్తయిన తరువాత జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 71.82 శాతంగా అధికారులు లెక్క తేల్చారు. అంటే ఆరు గంటల తరువాత ఓట్లు వేసిన వారు 5.35 శాతం. వాస్తవానికి జిల్లాలో ఓటర్లు 35,78,458 మంది. వారిలో 71.82 శాతం మంది ఓట్లు వేశారని అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం...25,70,830 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కల ప్రకారం గడువు మీరిన తరువాత ఓట్లు వేసినవారు 5.35 శాతం కాగా వారి సంఖ్య 1,37,495. వీరిలో అత్యధికులు మహిళలు. వీరు ఏ పార్టీకి మొగ్గుచూపారు?, ఎవరిపై అభిమానంతో ఓటు వేశారనే దానిపై అంచనాలు, విశ్లేషణలు నడుస్తున్నాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద రెండు విడతలుగా బ్యాంకుల్లో రూ.20,000 జమ చేశారు. డ్వాక్రా మహిళలు ఆ సొమ్ము తీసుకొని పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకున్నారు. మరికొందరైతే బంగారం వస్తువులు కొనుగోలు చేశారు. వారు ఆ ఆనందంలో వుండగానే ఓటు వేసే సమయం వచ్చింది. కృతజ్ఞత ప్రకటించేందుకు ఇదే చక్కని సమయమని, తమ పార్టీకే వారంతా ఓట్లు వేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు తరువాత రాత్రి జరిగిన ఓటింగ్‌లో అధిక శాతం తమకే పడిందని అంటున్నారు.