ఏపీలోని పలు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, తుది ఫలితాల్లో ప్రకటించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఈ తేడా వందల్లో ఉండగా... మరికొన్ని చోట్ల వేలల్లో ఉంది. అధికారిక గణాంకాల్లోనే ఇలా తేడాలు ఉన్నాయి. ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. ఏ శాసనసభ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న గణాంకాలను అందులో పేర్కొంది. తాజాగా ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే చాలా నియోజకవర్గాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలైన ఓట్ల కంటే ఫలితాలు ప్రకటించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండగా. ..మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది.
ఒంగోలులో 1,92,664 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,90,731 ఓట్లు మాత్రమే తేలాయి. గురజాలలో 2,24,218 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 2,24,055 ఓట్లు మాత్రమే తేలాయి. డోన్ లో 1,73,403 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,86,484 ఓట్లు తేలాయి. చిలకలూరిపేటలో 1,91,390 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,86,484 ఓట్లు మాత్రమే తేలాయి. పొన్నూరులో 1,88,893 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,89,066 ఓట్లు మాత్రమే తేలాయి. తాడిపత్రిలో 1,90,728 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,86,780 ఓట్లు మాత్రమే తేలాయి. గుంటూరు తూర్పులో 1,61,177 ఓట్లు పోల్ అవ్వగా, ఫలితాల్లో మాత్రం 1,61,239 ఓట్లు మాత్రమే తేలాయి. ఇలా అనేక చోట్ల తేడా వచ్చాయి.
దీనికి సహేతుక కారణాలున్నాయని...అనవసర సందేహాలు అవసరం లేదని రిటర్నింగ్, ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అలా వ్యత్యాసాలు ఎందుకొచ్చాయనే దానిపై రిటర్నింగ్ అధికారుల నుంచి వివరణ కోరుతామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని ఈవీఎంలు మోరాయించాయి. బ్యాటరీ పనిచేయక మరికొన్నింటిని తెరిచేందుకు వీలు లేకపోయింది. మాక్‌పోల్ అనంతరం కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను జీరో చేయకుండానే...పోలింగ్ ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లోని ఈవీఎంలను లెక్కించకుండా పక్కన పెట్టేశారు. కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులకు, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే చివర్లో కూడా వాటిని లెక్కించలేదు. వాటిల్లో పోలైన ఓట్ల వివరాలను ఫలితాల సమయంలో కలపలేదు అని అధికారులు చెప్తున్నారు.