ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో మోసం జరిగే ఆస్కారం ఉన్నందున వచ్చే ఎన్నికల్లో వీవీప్యాట్ చీటీలు 100% లెక్కించే విధంగా కేంద్ర ఎన్నికలసంఘంపై ఒత్తిడి తీసుకురావాలని... కోల్‌కతాలో సమావేశమైన విపక్ష నేతలు నిర్ణయించారు. దీనిపై ఒక కార్యాచరణ రూపొందించుకొని అన్ని పార్టీల నేతలూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు. దీనిపై ఒక నివేదిక రూపొందించేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. కమిటీలో అభిషేక్ మనుసింఘ్వీ (కాంగ్రెస్), అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), సతీష్ మిశ్ర (బీఎస్పీ), కేజ్రీవాల్ (ఆప్) సభ్యులుగా ఉంటారు.
శనివారం మమతాబెనర్జీ నేతృత్వంలో బహిరంగసభ ముగిసిన తర్వాత అన్ని పార్టీలనేతలూ అక్కడి ఓ హోటల్‌లో సమావేశమై సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈనెల 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున ఆలోపు దిల్లీలో ఒకసారి అన్నిపార్టీల నేతలూ కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్థి గురించి ఎన్నికల అనంతరమే ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దేశ ప్రయోజనాలకోసం తామంతా ఒక్కటిగా ఉన్నామని, ప్రధానమంత్రి పదవి కంటే దేశ భవిష్యత్తే తమకు ముఖ్యమన్న సందేశాన్ని ప్రజలకు చెప్పాలని తీర్మానించారు.
ఈ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ప్రతిపక్షాలపై మరింత కక్షపెంచుకొనే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కొందరు నేతల్లో వ్యక్తమైంది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్‌లాంటి వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న అంశంపై చర్చించారు. ఇకమీదట ఎవరిమీద కేసులుపెట్టినా అంతా సంఘటితంగా పోరాడటంతోపాటు, అండగా నిలవాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నాయకులపై కక్షపూరితంగా ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని, సాధారణ ఎన్నికల సమయంలో వాటికి అవకాశమివ్వరాదంటూ... సంబంధిత విభాగాల బాధ్యుల్ని కలిసే అంశంపై కూడా దిల్లీలో జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.