మోదీ సర్కారు ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోందన్నది విపక్షాల ఆరోపణ! ఈ జాబితాలో రాజ్యాంగ సంస్థ ‘కాగ్’ను కూడా చేర్చారా? ఇది... 60 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసుల మాజీ అధికారులు చేసిన అభియోగం! దేశాన్ని కుదిపేవేస్తున్న నోట్లరద్దు, రాఫెల్ వ్యవహారాలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని 60 మంది మాజీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కంప్ట్రోలర్ అడిటర్ జనరల్ (కాగ్)ను నిలదీశారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన కాగ్ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాలపై ఆడిట్ నివేదికలను తయారు చేయడంలో జాప్యం చేస్తుందని విమర్శించారు.
ఈ చర్య వెనుక బిజెపి రాజకీయ ప్రయోజనా లున్నాయని, ఎన్నికల ఏడాది కావడంతో వాస్తవాలు బయటకు వస్తే ఆ పార్టీకి నష్టం జరగుతుందనే జాప్యం చేస్తున్నారని వీరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు ప్రశ్నలను లేవనెత్తుతూ వారు కాగ్‌కు ఒక లేఖ రాశారు. అదే లేఖను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కూ పంపుతున్నట్లు తెలిపారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో పంజాబ్ మాజీ డిజిపి జులియో రబిరో, అరుణారారు, పుణే మాజీ పోలీస్ కమిషనర్ మీరన్ బుర్వాన్‌కర్, ప్రసారభారతి మాజీ సిఇఓ జవహర్ సర్కార్, ఇటలీలో భారత్ మాజీ రాయబారి కెపి ఫాబియన్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ, అఖిల భారత సర్వీసులకు చెందిన పలువురు అధికారులు సంతకాలు చేశారు.
‘‘సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కాగ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అత్యంత కీలకమైన నోట్ల రద్దు, రాఫెల్‌పై నివేదికలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోంది’’ అని వీరు ఆరోపించారు. వెంటనే ఈ రెండు అంశాలపై కాగ్ నివేదిక సమర్పించాలని... దీనిని శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచాలని డిమాండ్ చేశారు. ‘‘నోట్ల రద్దు ప్రభావం, బ్యాంకులు ఇచ్చిన సమాచారం, కొత్త నోట్ల ముద్రణకు పెట్టిన ఖర్చు, సంచిత నిధికి ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్... ఈ మొత్తంపై సమగ్ర పరిశీలనాత్మక నివేదిక సమర్పిస్తామని కాగ్ శశికాంత్ శర్మ 20 నెలల కిందట ప్రకటించారు. కానీ... ఇప్పటిదాకా ఆ నివేదిక ఊసే లేదు. రాఫెల్‌పైనా ఈ ఏడాది సెప్టెంబరులోనే కాగ్ నివేదిక ఇస్తుందని వార్తలు వచ్చాయి. దానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయేను ఇబ్బంది పెట్టకూడదనే నోట్ల రద్దు, రాఫెల్‌పై కాగ్ మౌనం పాటిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది’’ అని మాజీ అధికారులు తెలిపారు.