ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు అంటే ఇది వరకు ఒక విలువ ఉండేది. మన వ్యవస్థలో రాజకీయ నాయకులు ఎంతో, అధికార యంత్రాంగం అంత. మొన్నటి వరకు అధికారులు నిక్కచ్చిగా ఉండేవారు. ముఖ్యమంత్రి, మంత్రి తప్పులు చేస్తే తప్పు అని చెప్పే వారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అధికారులు డమ్మీ అయిపోయారు. ముఖ్యమంత్రి కానీ, ఆయన కింద ఉండే సలహాదారులు కానీ ఏది చెప్తే, అధికారులు అది చేయాలి. ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి. ఆ జీవో విడుదల చేయాలి. ఇదే వారి పాలిత శాపం అవుతుంది. డీజీపీ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి కింద స్థాయి అధికారులు దాకా అందరూ, కోర్టు ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి. రెండు రోజుల క్రితం ఏపిలోని ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లకు కోర్టు శిక్ష విధించిన సంగతి, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలో అనుభవాలు తెలిసి కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా వ్యవహరించటం పై, విస్మయం వ్యక్తం అవుతుంది. ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి, కోర్టు శిక్ష వేస్తే, దానికి బలి అయ్యేది ముఖ్యమంత్రో, మంత్రో కాదు, కేవలం అక్కడ ఉన్న అధికారులు మాత్రమే. అన్నీ తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించటం పై రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ శుభ్రమణ్యం మాట్లాడుతూ, ఇది వరకు అధికారులు తమ అభిప్రాయాన్ని ఫైల్ లో రాసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని, వీళ్ళు భయపడకుండా పని చేయాలని, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ, సస్పెండ్ చేసే అధికారం వాళ్లకు లేదని అన్నారు. మరో మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు మాట్లాడుతూ, సలహాదారులు వ్యవస్థ అధికారుల పై ఎక్కువ పెత్తనం చేస్తూ, వాళ్ళు చెప్పిందే జరిగాలి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే, అధికారులు బలి అవుతున్నారని అన్నారు. ఇక మొన్నటి వరకు జగన్ సిఎంవోలో పని చేసిన పీవీ రమేష్ మాట్లాడుతూ, 2012లో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లి వచ్చినా అధికారులు మారలేదని, దీని పై వారు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. చివరకు ఎమ్మెల్యే కూడా పెత్తనం చేసేస్తున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఇక సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కోర్టు చేసేది రిఫరీ పని అని, ప్రభుత్వాలు తప్పు చేయకుండా ఉంటే, కోర్టులకు ఏమి పని ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. మరి ఇంత మంది మాజీ అధికారులు చెప్పిన తరువాత అయినా, ప్రభుత్వం మారుతుందో లేదో మరి.