ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు భాజపా నేతలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 29సార్లు దిల్లీ వెళ్తే మొండిచేయి చూపడమే ప్రత్యేక ప్రాధాన్యమా? అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం చల్లడమే ప్రత్యేకతా ? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, గ్రామ, మండల, రాష్ట్ర పార్టీ బాధ్యులతో ‘ఎలక్షన్ మిషన్- 2019’పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్‌కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నేతలు పాల్గొంటే.. భాజపాయేతర పక్షాల్లో తెరాస అధినేత కేసీఆర్, వైకాపా అధ్యక్షుడు జగన్ హాజరుకావడంలేదన్నారు. వీరిద్దరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారన్నది సుస్పష్టమవుతోందని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అసలు లేదు.. అదొక శూన్యం మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు అన్నారు. అది భాజపాకు ప్రతిపక్షమే కాదని విమర్శించారు. రాష్ట్రంపై తెరాస నేతల ద్వేషాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. తెరాసతో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. వరంగల్‌లో రాళ్లేసిన వాళ్లతో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. కేసుల కోసం మోదీతో, అక్రమాస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు పెట్టే అభ్యర్థులను వైకాపా వెతుకుతోందని, ఆ పార్టీ అభ్యర్థులెవరూ ప్రజల్లో ఉండేవారు కాదని చంద్రబాబు విమర్శించారు. భాజపా దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తోందని.. దీనికి శబరిమలలో ఉద్రిక్తతలే ఉదాహరణగా చంద్రబాబు చెప్పారు.
కర్ణాటకలో భాజపా దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెదేపా చరిత్రాత్మక విజయం సాధించాలన్నారు. ఓటర్ల జాబితా అందరికీ అందుబాటులో ఉంచామని.. మార్పులు, చేర్పులపై అంతా శ్రద్ధ చూపాలని కోరారు. ఎన్టీఆర్ 23వ వర్థంతిని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంటు, 150 శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించేలా అంతా సమష్టిగా పనిచేయాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.