ఇప్పటికే అనే సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి, అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. ఇదేదో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేది కాదులేండి. మందుబాబులకు సంబంధించినది. రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. ‘హోలోగ్రామ్స్’ సంస్థకు ఎక్సైజ్ శాఖ బకాయిపడడంతో సాంకేతిక సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా మూడు రోజులుగా డిపోల నుంచి మద్యం నిల్వలు దిగుమతి చేసుకోలేకపోయింది. సరఫరా లేక రిటైల్ మద్యంషాపులు చాలావరకు ఖాళీ అయిపోయాయి. ఏడాది క్రితం పాలసీ ప్రవేశపెట్టిన కొత్తలో హెచ్పీఎఫ్ఎస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించని కారణంగా షాపుల్లో మద్యం కొరత ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులెదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ పరిస్థితి పునరావృతమైంది.
సరఫరా నిలిచిపోయిందిలా..!: రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రభుత్వం పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసింది. డిస్టిలరీలు, మద్యం డిపోలు, షాపులు, ఎక్సైజ్ స్టేషన్లు అన్నిటిలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి, అమ్మకాలను, ఉత్పత్తి, దిగుమతులను దానికి అనుసంధానం చేసింది. సీసా తయారైన వెంటనే డిస్టిలరీలో హోలోగ్రామ్ స్టిక్కర్ వేసి స్కాన్ చేస్తారు. అక్కడి నుంచి ఆ సీసా అమ్మే వరకూ ఏ షాపులో, ఎప్పుడు అమ్మారు అనే వివరాలన్నీ ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. గత 17 నెలల నుంచి హోలోగ్రామ్స్కు సంబంధించిన సొమ్ము దాదాపు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా ఎక్సైజ్ అధికారులు స్పం దించకపోవడంతో మద్యం డిపోల్లో సేవలు ఆపేసింది. మరో పక్క, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులపై దాడులు నిర్వహించింది. అనధికారంగా మద్యం విక్రయిస్తున్న 187 బెల్టులపై కేసులు నమోదుచేసి, 189 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారి తెలిపారు. 405.28 లీటర్ల లిక్కర్, 6.5 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 5 లీటర్ల నాటుసారా, మూడు వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు.