కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని కనీసం నాలుగు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తుండగా, ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం అవుతాయన్న విషయంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు సాగతున్నాయి. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం 2004లో దాదాపు ఇవే సంస్థలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాయి. కానీ అందుకు భిన్నంగా యూపీఏ అధికారంలోకి వచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అంతేకాదు, 2015 ఢిల్లీలో ఎన్నికలు జరిగినప్పుడు ఆప్ బొటాబొటీ మెజారిటీ సాధిస్తుందని వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రకటించగా, ఆప్ మొత్తం 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించిన విజయం తెలిసిందే. 2015లో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీయే 100 నుంచి 127 సీట్లు గెలుచుకుంటుందని తేల్చాయి. కానీ 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో ఎన్డీయేకి 58 సీట్లే లభించాయి.
గత ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ ప్రధానపక్షాలుగా తలపడిన రాష్ట్రాలు మూడు. ఆ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఇప్పుడు అవే రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీ్‌ప చేస్తుందన్నట్లుగానే చెబుతున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌లో సైతం బీజేపీకి గణనీయంగానే సీట్లు వస్తాయని చెబుతున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఖైరానా, ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అలాంటి యూపీలో గరిష్ఠంగా 73 సీట్ల దాకా కమలనాథులకు వచ్చే అవకాశం ఉందని టుడేస్ చాణక్య చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2017లో 182 సీట్ల గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా.. కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలిచింది. అలాంటి గుజరాత్‌లో సైతం ఈసారి బీజేపీ క్లీన్‌స్వీ్‌ప చేస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వేయడం గమనార్హం. 2014 ఎన్నికలప్పుడు కూడా ఏపీ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. ఒక్క లగడపాటి టీమ్, చాణక్య-న్యూస్ 24 మాత్రమే ఫలితాలను సరిగ్గా వేయగలిగాయి. వీటన్నిటి నేపథ్యంలో.. ఈ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే సంస్థల సగటు ఫలితాలు వాస్తవ ఫలితాలకు అందనంత దూరంలోనే ఉంటూ వస్తున్నాయి. ఏకంగా 13 సర్వే సంస్థల సగటు చూసినా ఈసారి ఎన్డీయేకు 303 సీట్లు వస్తాయి. విశేషం ఏమిటంటే, 2009 ఎన్నికల్లో ఎన్టీయేకు సగటున 186 సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అప్పట్లో ఆ కూటమికి వచ్చిన సీట్లు 160 మాత్రమే. యూపీఏకు సగటున 197 వస్తాయని అంచనా వేస్తే, ఆ కూటమి 262 సాధించింది.