2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలలుగన్న ఫార్ములా-1 రేస్ పోటీలు, నేడు అమరావతిలో సాకారమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి వైపు పారిశ్రామికేవేత్తలు చూస్తున్నారని, త్వరలోనే అమరావతి ముందు వరుసలో నిలవనుందన్నారు. అమరావతి ఎఫ్1హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ పోటీలను చివరిరోజు ఆదివారం వీక్షించిన చంద్రబాబు ఫలితాల అనంతరం ప్రసంగించారు. ఇక నుండి ప్రతి ఏడాది ఎన్టీఆర్ సాగర్‌లో పవర్ బోట్ రేస్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు.
వచ్చే ఏడాది ఇదే సీజన్‌లో ఫార్ములా-1 బోట్ రేసులు తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 1 నుండి 7 వరకు కృష్ణానదిలో వాటర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్ములా-1 పోటీలను అమరావతిలో నిర్వహించేందుకు హెచ్2వో ఎంతో సహకారం అందించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో ఫార్ములా-1 పోటీలు నిర్వహించాలని ప్రయత్నించామన్నారు. అయితే ఇప్పటికి ఆ కల అమరావతిలో సాకారమైందన్నారు. ఇక నుండి ప్రతీ నెల అమరావతిలో ఒక ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫన్‌తో పాటు బిజినెస్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే బిజిసెన్ సమ్మిట్ల ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న అమరావతి రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలను ఆకర్షించనుందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం టూరిజం అభివృద్ధికీ అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని రంగాల అభివృద్ధికి టూరిజం ఎంతో కీలకమన్న చంద్రబాబు ఆ శాఖ అధికారుల సమన్వయంతోనే ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. వీటి స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావచ్చని అశిస్తున్నామన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న ఎయిర్‌ఫోర్స్ ఈవెంట్ కూడా ప్రపంచ దేశాలను ఆకర్షించిందన్నారు.