ఈ రోజు, చిత్తూరు జిల్లాలో ఉన్న నాకు, ఎక్కడో బాంబేలో ఉన్నటు వంటి మహానుభావుడు నా పేదరికాన్ని గుర్తించి, ఒక ట్రాక్టర్ పంపించాడని, సోనూ సూద్ కు కృతజ్ఞత తెలిపారు. ట్రాక్టర్ వచ్చిన తరువాత, తన కుటుంబం, భార్యా, పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటే, తన పై, తన కుటుంబం పై కొంత మంది మీడియాలో, సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారని అన్నారు. నేను పేదవాడిని కాదని, ఏకంగా తన ఇంటికి ఆఫీసర్లను పంపించారని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే ఇదేదో సరదా కోసం చేసామని చెప్తున్నారని, ఆడ పిల్లలు వీడియో తీస్తుంటే సిగ్గు పడుతూ నవ్వారని, దానికి కూడా పెడ అర్ధాలు తీశారని ఆవేదన వ్యక్తం చేసారు. లావుగా ఉన్నారని, అంటున్నారని, మా శరీరం రంగులు, కొలతలు చూసి, మమ్మల్ని అర్ధం చేసుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేసారు. ఎక్కడో టీ కొట్టు పెట్టుకునే బ్రతికే తానూ, కరోనా వల్ల సొంత ఊరు రావాల్సి వచ్చిందని, ఇక్కడే ఒకే గదిలో ఆరుగురం ఉంటున్నామని, మా తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్ మీద బ్రతుకుతున్నామని అన్నారు.
వ్యవసాయం మొదలు పెట్టే సమయంలో కాడెద్దులు, ట్రాక్టర్ కోసం వెళ్తే 1500, రెండు వేలు అడిగారని, అంట స్తోమత తన దగ్గర లేదని, అప్పుడు తన కూతుళ్ళు ముందుకు వచ్చారని అన్నారు. మా పరిస్థతి చెప్పాలంటేనే సిగ్గు వేస్తుంది, కానీ ప్రభుత్వాన్ని నేను ఏమైనా నిందించానా ? నేను ఏ పార్టీకి చెందిన నాయకుడుని కాదు, ప్రజా సంఘంలో ఒక నేతను, 2009లో డమ్మీ అభ్యర్ధిగా ఎవరో ఒక వ్యక్తీ పోటీ చెయ్యమంటే చేసానని చెప్పుకొచ్చారు. మా పరిస్థితికి దేవుడిలా సోనూ సూద్ వచ్చారని, తరువాత చంద్రబాబు గారు కూడా ఒక ప్రతిపక్ష నేతగా, ఈ జిల్లా వాడిగా, తన కూతుళ్ళ చదువు కోసం సాయం చేస్తామని చెప్పారని, అప్పటి నుంచి తన పై దాడి మొదలు పెట్టారని అన్నారు. ఎవరైనా సరే తన ఇంటికి వచ్చి, తన పరిస్థితి చూసి, మాట్లాడాలని వేడుకుంటున్నా అని, మా బ్రతుకు ఇట్టా బ్రతకనివ్వండి అని, మా మీద ప్రచారాలు మానండి అని వేడుకున్నారు. మళ్ళీ మమ్మల్ని రోడ్డు పాలు చెయ్యవద్దు అని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాని అన్నారు.