ఆయన ఒక సామాన్య రైతు... కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, మట్టినే నమ్ముకున్న రైతన్న... బిల్ గేట్స్ కూడా వస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కు, వైజాగ్ వెళ్లారు... ఆ కాన్ఫరెన్స్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ కు, ముఖ్యమంత్రితో పాటు, అక్కడ ఉన్న ఫారన్ డెలిగేట్స్ కూడా ఆశ్చర్యపోయారు.... ఆయనే గుంటూరు జిల్లా రైతు మేకా రాధాకృష్ణ మూర్తి.. ఆయన ప్రసంగం ముఖ్యమంత్రి చంద్రబాబును విపరీతంగా ఆకర్షించింది. గురువారం రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాధాకృష్ణమూర్తి మాట్లాడారు. సాగులో తన అనుభవాన్ని వివరించారు.
రాధాకృష్ణమూర్తి ప్రసంగం ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది. వెంటనే ఆయనను వేదికపైకి పిలిపించి సన్మానించారు. ఆయనకున్న తెలివి మంత్రికి, అధికారులకు లేదంటూ చమత్కరించారు. రైతు రాధాకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మంత్రి, సెక్రటరీ, డైరెక్టర్, వైస్ ఛాన్పలర్ కంటే రాధాకృష్ణకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని కొనియాడారు. నాలెడ్జ్ అంటే యూనివర్శిటీలో కాదని, క్షేత్రస్థాయిలో అమలు చేసి ఫలితాలు రాబట్టటమే నిజమైన నాలెడ్జ్ అని అన్నారు. రైతు రాధాకృష్ణమూర్తి చెప్పినట్లు అందరూ అలవాటు చేసుకుంటే మనకు సమస్యలు ఉండవని సీఎం అన్నారు.
విశాఖ అగ్రిటెక్ సదస్సులో భాగంగా రెండో రోజైన గురువారం రైతు మేకా రాధాకృష్ణ మూర్తి సభలో మాట్లాడుతూ పశువులు వేసిన 50 నుంచి 100 కిలోల పేడను పొలంలో స్ప్రేడ్ చేశామని, అదే వ్యవసాయమని, తర్వాత నారు పోయడంగానీ, తీయడంగానీ, దమ్ము చేయడంగానీ, గట్లు బాగుచేయడం గానీ, దుక్కు దున్నడంగానీ, పాయలు తీయడం.. ఏ పని లేకుండా డైరెక్టుగా సోయింగ్ చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం లెక్క ప్రకారం ఒక ఎకరా మాగానికి 60 మంది కూలీలు కావాలని, అందులో 30 మందిని తగ్గించామని, దాంతో సగం డబ్బులు మిగిలాయని, ఆవు పేడ వేసిన తర్వాత ఏమీ చేయమని, వ్యవసాయంలో ముఖ్యంగా ఖర్చుండేది కలుపని, కలుపుని కలుపుతోనే నిర్మూలించవచ్చునని రాధాకృష్ణ మూర్తి చెప్పారు.