రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి మరింత ఉదారంగా సాయంచేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ఐదెకరాల లోపు రైతులకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని నిశ్చయించారు. గత కేబినెట్ సమావేశంలో రూ.10 వేలే ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఏమూలకూ సరిపోదని మంత్రులు, టీడీపీ నేతలు అభిప్రాయపడడంతో భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం.. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ.6 వేలకు అదనంగా మరో రూ.9 వేలు కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుంది.
అంటే ఐదెకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ రూ.15 వేలు చొప్పున లభించనున్నాయి. ఐదెకరాలు దాటిన రైతులకు కేంద్రం ఏమీ ప్రకటించకపోయినా.. రాష్ట్రప్రభుత్వమే ‘అన్నదాతా సుఖీభవ’ కింద రూ.10 వేలివ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న రైతు కుటుంబాలు 54 లక్షలుగా అంచనా వేశారు. ఐదెకరాల కన్నా ఎక్కువున్న రైతు కుటుంబాలు 15 లక్షలుగా భావిస్తున్నారు. ముందుగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.4 వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపే ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 69 లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు రూ.3,660 కోట్లు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే దాదాపు 15 లక్షలు ఉన్న కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఖరీఫ్ వచ్చే నాటికి వీరికి సాయం అందించాలని నిర్ణయించింది.
‘అన్నదాతా సుఖీభవ’ పథకం అమలుపై శనివారం ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం చర్చించింది. రైతులకు కేంద్రం ప్రకటించిన సాయం సరిపోదని పలువురు మంత్రులు సీఎం వద్ద ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం కేంద్రం ఇస్తానంటున్న రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.9వేలు కలిపి సన్నచిన్న కారు రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముక్త్యాల ఎత్తిపోతల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో పాటు అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతు కుటుంబానికి రూ.9వేలు అదనంగా ఇస్తామని ప్రకటించారు. రైతు కుటుంబంలో భార్య, భర్త, మైనరు పిల్లలుంటే ఒకే కుటుంబంగా.. అదే పిల్లలు మేజర్లు అయి వారికి పెళ్లిళ్లై ఉంటే వేరే కుటుంబంగా పరిగణిస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.