హంద్రీనీవా కల సాకారమై, చిత్తూరు జిల్లాలోకి మొదటిసారి ప్రవేశిస్తున్న కృష్ణమ్మను చూసి, ఒక రైతు ఎంతో ఉద్వేగంతో అంటున్న మాటలు ఇవి.. "కృష్ణమ్మా.. నీ తడి.. మా కరవు నేలను ముద్దాడగానే.. మా పుడమి పులకించింది. మది ఎగిరిగంతేసింది.. నీ జలం మాకు బలం కానుందని.. కరవు ఛాయలు మాయమవుతాయని.. కన్నీళ్లు ఇక మా కళ్లలోనే ఒదిగిపోతాయనే విషయం తెలిసి.. శరీరంలోని నవనాడులు ఆనంద తాండవం చేస్తున్నాయి.. ఎందుకంటావా కృష్ణమ్మా..! ఏళ్లుగా మా ప్రాంతంలో మెరుపు జాడలేదు.. ఉరుము అరుపు లేదు.. చినుకు రాలలేదు.. ఫలితం.. వాగు ఆరిపోయింది.. చేను ఒరిగిపోయింది.. జలం పాతాళంలోకి చేరిపోయింది.. మేడి అటకెక్కింది.. కాడెద్దు కనుమరుగైంది.. "
"రైతు కుటుంబం చెదిరింది.. ఆ‘కలి’ వేధించింది.. పేగుబంధం కళ్లల్లో కనిపించింది.. పట్టణాలకు వలస దారి పరిచింది.. పల్లె బోసిపోయింది.. పచ్చని లోగిలి మాయమైంది..నాగలికి చెదలు పట్టింది.. నాగరికత మారింది.. శిథిలమైన గ్రామాలు.. కళ తప్పిన చెరువులు.. కుంటలు.. వాగులు.. వంకలు అన్నదాతల సమాధులకు నిలయాలుగా మారాయి.. నాగేటి సాళ్లల్లో స్వేదం చిందించి.. సిరులు పండించి.. అన్నదానం చేసిన చేతులు.. సర్కారు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాయి.. కానీ.. నువ్వొస్తున్నావని తెలిసి హృదిలో ఆశ చిగురిస్తోంది.. కాడెద్దులు తిరిగొస్తాయని.. లేగదూడలు గెంతులేస్తాయని.. పైరు పచ్చబడుతుందని, ముంగిళ్లు మురుస్తాయని.. మా ఇంట సంతోషం వెల్లివిరుస్తోంది."
కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి నీటిని మళ్లించి కర్నూలు జిల్లాలోని హంద్రీ నది మీదుగా చిత్తూరు జిల్లాలోని నీవా నదిని అనుసంధానించే బృహత్ ప్రాజెక్టే హంద్రీ-నీవా సుజల స్రవంతి. సర్ అర్థర్ కాటన్ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ హయాంలో తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో కాస్త కదలిక వచ్చినా పురోగతి లోపించింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచడంతో ప్రస్తుతం బ్రాంచి కెనాల్ ద్వారా చిత్తూరు సరిహద్దుల వరకు నీటిని తీసుకురాగలిగారు. హంద్రీ-నీవా రెండో దశలో భాగంగా అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 1.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ఇటీవల పూర్తిగా నిండింది. అక్కడి నుంచి మొదలయ్యే ప్రధాన కాలువ కదిరి మండలం పట్నం గ్రామం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌గా వీడిపోతుంది. ఇది 22 కిలోమీటర్లు ప్రవహించి కదిరికి చేరువలోని చెర్లోపల్లి జలాశయానికి చేరుతుంది. ఈ మార్గంలో ఎనిమిది చోట్ల లిప్టుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడుతున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.425 టీఎంసీలు. ఇప్పటికే 0.6 టీఎంసీల నీరు చేరింది. మూడు రోజుల క్రితం నీటిని కిందికి వదలడంతో చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని పెద్దతిప్పసముద్రం మండలం బొంతాలపల్లె పంప్‌హౌస్‌కు చేరుతోంది. ఈ దఫాలో చిత్తూరు జిల్లాకు 1.2 టీఎంసీల నీటిని తరలించనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.దుర్భిక్ష ప్రాంతమైన మదనపల్లె డివిజన్‌కు ఈ కాలువ జీవరేఖ కానుందని భావిస్తున్నారు.