‘రాష్ట్రంలో పెథాయ్‌ తుపాన్‌ బాధితులకు ఈ నెల 20వ తేదీనే నష్టపరిహారాన్ని చెల్లిస్తాం. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని కూడా అదేరోజున అందజేస్తాం. 19వ తేదీ సాయంత్రానికి పంట, ఇతర నష్టాలు అన్నింటిపైనా గణన పూర్తి చేస్తాం. మంగళవారం సాయంత్రానికి విద్యుత్తు, నీటి సరఫరా వంటివన్నీ పునరుద్ధరిస్తాం. 20వతేదీ నాటికి ఇతర పనులన్నింటినీ పూర్తి చేస్తాం...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ప్రజలు తమ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 13 జిల్లాలకు అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను రూపొందించింది. అయితే కేవలం రెండు రోజుల్లో పంట నష్టం పరిహారం ఇస్తామని చంద్రబాబు చెప్పటంతో, విలేకరులు అవాక్కయ్యారు.

cyclone 18122018 2

నష్టం అంచనాపై ఆర్టీజీ రెండు మొబైల్‌ యాప్‌లను రూపొందించింది. ఒకటి అధికార యంత్రాంగానికి, మరొకటి ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. అధికారులు వాటి ద్వారా నష్టం ఫొటోలు, వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, పునరుద్ధరణ చర్యలపై సోమవారం రాత్రి వరకు సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెథాయ్‌ చిన్న తుపాను అయినప్పటికీ ఈ అనుభవాన్ని డాక్యుమెంట్‌ చేసి రేపటి అవసరాలకు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. హుద్‌హుద్‌, తిత్లీ తుపాను అనుభవాలతో పెథాయ్‌పై అప్రమత్తమై క్షేత్రస్థాయిలో అందరినీ సిద్ధం చేయడంలో సఫలమయ్యామని అన్నారు.

cyclone 18122018 3

తుపాను ముందు జాగ్రత్తలు, సహాయచర్యల్లో పాల్గొన్న 51 మంది ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. పని ఎక్కువగా లేనందున అందరినీ వెనక్కి రప్పిస్తున్నామని, మంగళవారంనుంచి ఆయా జిల్లాల యంత్రాంగాలే సహాయ చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయా? అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటే 95 శాతానికిపైగా ప్రజలు సానుకూలంగా స్పందించారని వివరించారు. ఇలాంటి విపత్తుల్లో ప్రజలను భాగస్వాములను చేస్తే సత్ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. తుఫానుకు మూడ్రోజుల ముందే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సన్నద్ధమయ్యారు. చురుకైన అధికారులతో సైక్లోన్‌ టీంను ఎంపిక చేసుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read