ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామమందిరం గుర్తొస్తుందని, ఐదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా మంగళవారం కడప ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు మనకు బుర్ర లేదనుకుంటున్నారా? వాళ్లు ఏం చెబితే అది నమ్ముతాం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆఖరికి తీవ్రవాదాన్ని, దేశభద్రతనూ రాజకీయం చేస్తున్నారని ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. తమది సరిహద్దు రాష్ట్రమని, పాకిస్తానేంటో..తీవ్రవాదమేంటో..తమకు తెలుసునని అన్నారు. రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం చాలా దుర్మార్గమని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆనాడు జగన్ తనకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని ఆయన అన్నారు. డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటారని, జగన్‌కు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్ గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడని ఆయన కొనియాడారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా తనకు స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అద్బుతమైన కార్యక్రమాలు తీసుకువచ్చారని, అన్ని వర్గాలవారికి, మహిళల కోసం, యువత కోసం, వ్యవసాయదారుల కోసం అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు.
నదుల అనుసంధానం వంటి విధానాలు చాలా అద్భుతమని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మనం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఏం తింటున్నా.. మనం భారతీయులమని అన్నారు. దేశమంతా ఒక్కటేనని.. కానీ ప్రాంతాల వారీగా..మతాలవారీగా.. రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని తిప్పికొట్టాలని ఫరూక్ అబ్దుల్లా పిలుపు ఇచ్చారు. స్వతంత్ర పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులంతా ఏకమై నడిచారని, కులం, మతం ప్రస్తావన అప్పుడు రాలేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇప్పుడూ అంతేనని దేశం కోసం అందరూ ఏకమై.. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పుడు రోజులు మారిపోయాయని, ఎవరు ముస్లింలు, ఎవరు దళితులంటూ.. మతాల వారీగా రాజకీయాలు నడుపుతున్నారని ఫరూక్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత ఎండలో కూడా ఇంతమంది జనం వచ్చారంటే... ఎన్నికల్లోతీర్పు ఎలా ఉండబోతోందో తనకు అర్థమవుతోందన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు, అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇంత ఎండలో కూడా ఇంతమంది జనం వచ్చారంటే... ఎన్నికల్లోతీర్పు ఎలా ఉండబోతోందో తనకు అర్థమవుతోందన్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు, అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.