చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరే షన్ అనుబంధ సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ సంస్థ (సీఈటీసీ) శ్రీసిటీలో నూతనంగా పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేసింది. గురువారం శ్రీసిటీలో నిర్వహించిన ఈ భూమి పూజలో సీఈటీసీ సీఈవో, జనరల్ మేనేజర్ ల్యూయి లెహంగ్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈవో, రాష్ట్రప్రభుత్వ కార్యదర్శి జె. కృష్ణకిశోర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధి ల్యూయి లెహంగ్ మాట్లాడుతూ సీఈటీసీ అనుబంధ సంస్థ అయిన రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ పరిశ్రమ 200 మెగావాట్ల సౌర విద్యుత్ ఫోటో వోల్టాయిక్ సెల్ తయారీ పార్కును శ్రీసిటీలో ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, శ్రీసిటీలోని సదుపాయాలను చూసిన తాము సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటు చేసేందుకు దేశంలోని పలు పారిశ్రామిక నగరాలను పరిశీలించామన్నారు. ఎక్కడలేని లేని సదుపాయాలు శ్రీసిటీలో ఉన్నందునే తాము పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో మరికొన్ని ఎలక్ట్రానిక్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలున్నాయని వివరించారు. 18 నుంచి 20 నెలల్లోపు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సీఈటీసీతో పలు చైనా సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చైనా పర్యటనల ద్వారానే పరిశ్రమలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
చైనాకు చెందిన మొదటి భారీ తయారీ రంగ పరిశ్రమ సీఈటీసీ రాష్ట్రానికి వచ్చిన మొదటి పరిశ్రమ అని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. చైనా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమ కావడంతో భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో సోలార్ విద్యుత్ తయారీకి సీఈటీసీ రాక మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. డీటీజెడ్లో 18 ఎకరాల విస్తీర్ణంలో రూ. 320 కోట్లతో పరిశ్రమ చేస్తున్నట్లు ఆయన వివరించారు. నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. సీఈటీసీ ప్రస్థానం... చైనా ప్రభుత్వరంగ సంస్థగా 2002లో ప్రారంభమైన సీఈటీసీ సంస్థ బీజింగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది... 66 సెకండరీ యూనిట్స్, 8 లిస్టెడ్ కంపెనీలు, 42 అనుబంధ సంస్థలు, ప్రపంచ వ్యాప్తంగా 40 కార్యాలయాలు ఉన్నాయి... ఈ సంస్థలో 1.50 లక్షల మంది పనిచేస్తుండగా 110 దేశాల్లో వ్యాపార లావాదేవీలు విస్తరించి ఉన్నాయి..