అమరావతి రాజదానిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో, కృష్ణా నదిపై ఫ్లోటింగ్ రెస్తారెంట్, కాటేజీల ఏర్పాటుకు పర్యాటక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇది వరకే, చాంపియన్స్ యాచ్ క్లబ్, జలవనరుల శాఖ నిబంధనల కారణంగా వాటిని ఏర్పాటు చేయలేక పోయింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ప్రస్తుతం భవానీ ఐల్యాండ్ వద్ద తొలి దశలో గోవా తరహాలో వాటర్ స్పోర్స్ నడుపుతోంది. రెండవదశలో నీటి పై తేలియాడే ఫ్లోటేల్స్ భవానీ ఐల్యాండ్ చుట్టూ వంద వరకు నది పై ఏర్పాటు చేయటానికి ఈ సంస్థ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు కాటేజీలతో కూడిన 'మీనా' క్రూయిజ్ను కూడా సిద్ధం చేసింది.
పవిత్ర సంగమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విభిన్న రకాల వాటర్ స్పోర్ట్స్ నిర్వహించటానికి పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలను ఆకర్షించటం మొదలు పెట్టింది. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న చాంపియన్స్ యాచ్ క్లబ్ ఫైల్ ను క్లియరెన్స్ చేసేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ క్రమంలో నీటి పై తేలియాడే ఫ్లోటింగ్ రెస్తారెంట్, కాటేజీలను నడపటానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ కు అనుమతినిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటుగా తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పర్యాటకశాఖ కార్యకలాపాలు జరగాల్సి ఉంటుంది.