ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2019కు సంబంధించిన తుది జాబితా ప్రచురించే నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ మూడు నెలల వ్యవధిలో 15 లక్షల మంది పెరిగారన్నారు. ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం-6లో ఇంకా 10,62,441 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని, ఈ నెల 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 9.50 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశముందని భావిస్తున్నామన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆయన మాటల్లో... "తొలగించిన ఓట్లు 1.55 లక్షలు.. జనవరి 11 తర్వాత ఓట్ల తొలగింపు కోసం దాదాపు 9 లక్షలకు పైగా ఫారం-7 దరఖాస్తులొచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత 1,55,099 మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించాం. వీరంతా మృతిచెందిన వారు, ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు జాబితాలో ఉన్నవి, వలస వెళ్లిన వారివి. మిగతా దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించాం. మోసపూరితంగా వచ్చిన దరఖాస్తులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోన్న కథనాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఏమైనా జరుగుతోందా?..అని నిఘా పెట్టాం. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. "
"ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ తదితర ఖాతాలపై నిఘా పెట్టాం. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకూ వివిధ పార్టీలకు 89 నోటీసులు జారీ చేశాం. తెదేపాకు 48, వైకాపాకు 30, జనసేనకు 11 నోటీసులిచ్చాం. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదు. మేం గుర్తించిన అభ్యంతరకర అంశాలకు సంబంధించి వివరణ కోరతాం. వారిచ్చే సమాధానం పట్ల సంతృప్తి చెందితే సరే.. లేదంటే అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో ఆ మొత్తాన్ని కలపడం, పద్ధతి మార్చుకోమని హెచ్చరించటం, కేసులు నమోదు చేయటం వంటివి చేస్తాం. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు తెలుసుకుంటున్నాం. వారి సామాజిక మాధ్యమాలపై కూడా పర్యవేక్షణ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా.. శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చూసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షిస్తున్నాం. వివేకా హత్య అనంతరం కడప జిల్లా ఎస్పీతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నాం. కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల అధికారులతోనూ మాట్లాడాం."