ఏపీలో ఫారం-7 వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓట్ల తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు రావడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో ఫారం-7 దరఖాస్తులు ఏకంగా లక్షా 10వేలకు చేరాయి. అంతేకాదు ఏకంగా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటును తొలగించాలంటూ ఆన్‌లైన్ దరఖాస్తు రావడం సంచలనంగా మారింది. తన ఓటును తొలగించాలంటూ ఫారం-7 దరఖాస్తు రావడంతో ఎమ్మెల్యే షాక్ తిన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల ఎం.పైపల్లిలో తనకు ఓటు హక్కు ఉందని.. ఆ ఓటును తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు వెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఓటును తొలగించేందుకు దరఖాస్తు వచ్చిందని ఐరాల తహశీల్దార్ తనకు ఫోన్ చేసి చెప్పడంతో షాకయ్యానన్నారు.
పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ తతంగం అంతా చేసింది వైసీపీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఏకంగా ఫారం-7 ఉపయోగించి, సొంత పార్టీ ఎమ్మల్యే ఓటే లేపేసే ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డి నిన్న బహిరంగంగా నేనే ఓటు తొలగిస్తున్నా అని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో జగన్ నేర్పిన ఫారం-7 విద్యతో, ఏకంగా వైసీపీలో ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసి, ఓట్లు లేపేసుకుంటున్నారు. ‘మా ఓట్లు తీసేస్తున్నారు’ అని ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసిన వైసీపీ అధినేత జగన్... తామే ఇతరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు ఇచ్చినట్లు మొట్టమొదటిసారిగా అంగీకరించారు.
తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేలా ఆన్‌లైన్‌లో ఫామ్-7 దరఖాస్తులు తామరతంపరగా వస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ అంశాన్ని ఈసీ సీరియ్‌సగా తీసుకోవడంతోపాటు... తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఫామ్-7లు సమర్పిస్తున్నది మేమే’ అని వైఎస్ జగన్ స్పష్టంగా ప్రకటించడం గమనార్హం. మంగళవారం నెల్లూరులో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు చేర్చించారు. వాటిని తొలగించాలని ఫామ్-7 ద్వారా కోరాం’ అని తెలిపారు. అదే సమయంలో... వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్న వారి ఓట్లను టీడీపీ తొలగించే కుట్ర చేస్తోందని అన్నారు.