పదేళ్ళ నెల్లరు జిల్లా వాసుల కల సాకారం కానుంది. దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాకు విమానాశ్రయం అవసరమని 2007 లో అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 3500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థతో ఎంవోయూ కూడా చేసుకున్నా భూసేకరణ జాప్యం కావడం, ప్రభుత్వంలో పాలకుల ఉదాసీనతతో విమానాశ్రయం పనులు ముందుకు సాగలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ దగదర్తి వద్ద విమానాశ్రయం నిర్మించాల్సిందేనని నిర్ణయించింది. దీని కోసం భూసేకరణ చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. మొదట అనుకున్న 3500 ఎకరాలు కాకుండా తొలి, మలి విస్తరణకు అవసర మైన 1352 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.130 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేసింది.
దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ఈ నెల 9న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కంపెనీ లిమిటెడ్ (బీఐఏసీఎల్) సారథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం, నిర్వహణ జరగనున్నది. తొలి, మలి దశ విస్తరణ కోసం 1౩52 ఎకరాలు అవసరం కాగా, ప్రస్తుతం 1054 ఎకరాలు సేకరించారు.
పదేళ్లుగా ఈ విమానాశ్రయం కోసం పాలకులు ఎన్నో హామీలు గుప్పించి ఇదిగో వస్తోంది. అదిగో వస్తోంది. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్ ఈ విమానాశ్రయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమం అయింది.