తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అనుక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ సీఎం చంద్రబాబు పార్టీ కోసం నాలుగు నుంచి అయిదు గంటల సమయం రోజూ వెచ్చిస్తున్నారు. ప్రతిరోజూ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం నేతల తీరుతెన్నులపైకి ఆయన దృష్టి మళ్లింది. అంతర్గతంగా పార్టీ చేయిస్తున్న సర్వేలలో కొంతమంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ కార్యకర్తలలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా నివేదికలు అందాయి. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండటంలేదనీ, పనులు చేయడంలేదనీ కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపుగా ముప్పై నుంచి నలభై మందిని మార్చాల్సిందేనని అంచనాకు అధిష్టానం వచ్చింది.
ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో వారికి ప్రత్యామ్నాయం ఎవరనే అంశంపై పార్టీ బృందాలు ఆరాతీస్తున్నాయి. అయితే ఈ విధానంపై కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేని మార్చాలని ప్రయత్నిస్తే.. రెబల్స్‌గా వారు బరిలోకి దిగి కొత్తగా టిక్కెట్ ఇచ్చినవారిని ఓడించేందుకు ప్రయత్నిస్తారనీ, అదే జరిగితే పార్టీకి నష్టమనీ వాదిస్తున్నారు. అందువల్ల ముందే ఆయా శాసనసభ్యులను పిలిపించి తత్త్వం బోధపడేలా అన్ని విషయాలు వివరిస్తే మంచిదని అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా టిక్కెట్ నిరాకరించే పరిస్థితి వస్తే... పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక నియామక పదవి వారికి కట్టబెట్టే విధంగా ఒప్పిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. సదరు నేతలు అందుకు అంగీకరించని పక్షంలో పార్టీ నుంచి వారు వెళ్లిపోయినా లెక్కచేయకూడదని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత చంద్రబాబుకు సూచించారు. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం టీడీపీలో వాడివేడి చర్చ జరుగుతోంది. పార్టీ చేయిస్తున్న అంతర‌్గత సర్వే వివరాలు ఎమ్మెల్యేలకు లీకవుతున్నాయి. దీంతో వారు చంద్రబాబుకు దగ్గరగా ఉండే ముఖ్య నేతల వద్ద తమ మనసులో ఉన్న ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందన్న విషయం స్పష్టం కానప్పటికీ.. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో అంటూ కొందరు ఎమ్మెల్యేలు మీడియా మిత్రుల వద్ద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్న ఎమ్మెల్యేలకు మాత్రం ఇప్పుటికే గట్టి సంకేతాలు అందాయట. మరి కొందరికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. చంద్రబాబు సైతం ఈ అంశంపై ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నారు. మొన్నటివరకు సుతిమెత్తగా మాట్లాడిన ఆయన ఇప్పుడు స్వరం పెంచారు. మీకోసం మొహమాటానికి పోయి పార్టీని దెబ్బతీసేది లేదని స్పష్టంచేస్తున్నారు.