ప్రభుత్వ వైద్యశాలలో కిడ్నీ పేషంట్లతో పాటుగా, ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు కూడా ఉచిత డయాలసిస్ మరియు పింఛన్లు అందజేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు. బుధవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం,ప్రకాశం జిల్లా కనిగిరి,కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాలలో సికెడి వ్యాధి ప్రబలకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడమే కాకుండా దానిని యుద్ధప్రాతిపదికన అమలుచేయాలన్నారు. మూడు ప్రాంతాలలో 100% స్క్రీనింగ్ పూర్తిచేయాలన్నారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సురక్షిత తాగునీటిని అందుబాటులోకి తేవాలని,ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి శుద్ధిచేసిన నీటినే అందజేయాలన్నారు.
అధిక రక్తపోటు కారణంగా హై-డోస్ మందుల వినియోగం,విచక్షణా రహితంగా పెయిన్ కిల్లర్లు వాడటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు.కలుషిత తాగునీటి వినియోగం,అధిక టిడిఎస్ వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలుతున్న విషయంపై అందరినీ చైతన్యపరచాలన్నారు.తండాలలో అవగాహనా శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్వహిస్తున్న డయాలసిస్ కేంద్రాలకు అదనంగా మరో 14కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావు పేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి,ఆదోనిలో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు.
కృష్ణా జిల్లా ఎ.కొండూరులో 15తండాలలో 13వేల జనాభా ఉన్నారంటూ, డయాలసిస్ 21మందికి జరుగుతోందని, 821మంది రక్త నమూనాలు సేకరించినట్లుగా, ఇప్పటివరకు 3మెగా మెడికల్ క్యాంపులు, 34ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించినట్లుగా జిల్లాకలెక్టర్,డిఎంహెచ్ వో వివరించారు. ప్రభుత్వ వైద్యశిబిరాలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 24గం.అంబులెన్స్ వసతి కల్పించినట్లుగా ముఖ్యమంత్రికి వివరించారు.క్రమం తప్పకుండా స్క్రీనింగ్ లు నిర్వహిస్తున్నామన్నారు.
ఎ.కొండూరులో ఇటీవల ఒక వ్యక్తి మృతిపై మీడియాలో వచ్చిన కథనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించగా,గతంలో అతనికి డయాలసిస్ జరగలేదని అధికారులు తెలిపారు.క్రానిక్ కిడ్నీ డిసీజ్(సికెడి)తో ఇబ్బంది పడ్డాడని,రెండునెలల క్రితం స్క్రీనింగ్ లో బయట పడిందని చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.10వేల చెక్కు అందించామన్నారు.ఎ.కొండూరు మండలంలోని 19 గ్రామాలలో పరిస్థితి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉచిత మందులతో పాటుగా అందరికీ పోషకాహారం అందేలా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. జూన్ 1నుంచి అటుకుల లడ్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, తక్షణమే నూజివీడు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం,ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.మూడు జిల్లాలలోఇప్పటివరకు సికెడి వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్యసేవలపై నివేదిక ఇవ్వాలని కోరారు.