విజయవాడ నగర ప్రజలకు నెలాఖరులోగా ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ముందుగా ఎంజీ రోడ్డులో ఎంపిక చేసిన 55 ప్రాంతాల్లో దీన్ని ప్రారంభిస్తారు. దశల వారీగా అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఉచిత వైఫై ప్రణాళికను అధికారులు వివరించారు. అలాగే రాష్ట్రంలో 110 పురపాలక సంఘాల పరిధిలో 970 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయి. వెలగపూడి సచివాలయంలో ఏపీ డిజిటల్ ఇన్ఫా, ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నాటికి 1000 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా ఏపీ ఫైబర్ నెట్ పెట్టుకుందన్నారు. 53 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టులో గూగుల్ సంస్థ పాలుపంచుకోనుంది. గూగుల్ సంస్థ నెట్ సేవలను ఉచితంగా అందచేస్తుంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం ప్రభుత్వానికి గూగుల్ చెల్లించనుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇంటర్నెట్ సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ప్రజా ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 4000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు సీఎస్‌కు అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి రోజులో పలు విడతలుగా 40 నిమిషాలపాటు 15 ఎంబీపీఎస్ స్పీడుతో ఉచిత వైఫై సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వైఫై బాక్సులు అమర్చే ప్రాంతం నుంచి 40 మీటర్ల విస్తీర్ణం వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఏపీ డిజిటల్ ఇన్ఫ్రాతో జాయింట్ వెంచర్‌తో ఒప్పందం చేసుకున్న కంపెనీకి ప్రభుత్వ స్థలాలను న్యాయమైన ధరలకు అద్దెకు ఇవ్వాలన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం 30.33 శాతం ప్రభుత్వానికి సమకూరుతుందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 5జి సేవల కోసం 12000 టవర్లు అవసరం ఉంటుందని, ప్రైవేట్ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థలకు, వివిధ శాఖలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, భవనాలపై ఏర్పాటు చేసే టవర్లకు ఎంత అద్దె వసూలు చేయాలనే దానిపై పొరుగు రాష్ట్రాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.