వైసీపీ తరఫునప్రచారానికి రాలేమని, తాము జనసేనకు ఓటేస్తామని చెప్పినందుకు ఒక ఇంటి యజమాని.. అద్దెకు ఉంటున్న దంపతులపై కక్ష పెంచుకుని వారిపై దాడికి పాల్పడ్డాడు. గర్భిణి అనే కనికరమైనా లేకుండా ఆమెను జట్టుపట్టుకుని రోడ్డు మీదకు తోసేశాడు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో జరిగిందీ ఘటన. బాధితురాలి కథనం ప్రకారం.. నియోజకవర్గ పరిధిలోని పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతంలోని పిట్ట వీధిలో.. ఎన్.నాగమణి, సిద్దు అనే జంట స్థానిక వైసీపీ నేత, స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పిట్ట నాగేశ్వరరావు ఇంట్లో మూడేళ్లుగా అద్దెకుంటున్నారు. సిద్దు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు పనులకు వెళ్తుంటాడు. సిద్దు, నాగమణి దంపతులకు మూడేళ్లపాప ఉంది. నాగమణి ప్రస్తుతం నాలుగో నెల గర్భిణి.
ఇటీవలే ఆమెను పరీక్షించిన వైద్యురాలు.. ఆమె బలహీనంగా ఉన్నదని, విశ్రాంతి అవసరమని చెప్పారు. ఎండవేడి తగలకుండా జాగ్రత్తపడాలని సూచించారు. దీంతో వారు ఈఎంఐ పద్ధతిలో ఏసీ కొనుక్కుని.. ఇంట్లో బిగించుకునేందుకు యజమాని అనుమతి తీసుకున్నారు. ఇంతలో.. ఎన్నికల ప్రచారం మొదలైంది. స్థానిక వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి రావాలని.. దంపతులిద్దరికీ ఒక్కో ఓటుకూ రూ.వెయ్యి చొప్పున ఇస్తానని యజమాని పది రోజుల క్రితం నాగమణి దంపతులను కోరారు. అందుకు వారు నిరాకరించారు. నాగమణి గర్భిణి కాబట్టి బయటకు రాదని.. అయినా తాము పవన్‌కల్యాణ్ అభిమానులమని, జనసేనకే ఓటు వేస్తామని చెప్పారు. దీంతో యజమాని నాగేశ్వరరావు.. ‘ఎక్కడో బయట నుంచి వచ్చే పవన్‌కల్యాణ్‌కు ఓటు వేస్తే...ఏం ఉద్ధరిస్తాడు’ అంటూ గొడవ చేసి వెళ్లిపోయారు. తర్వాత వారు ఏసీ బిగించుకునే ప్రయత్నంలో ఉండగా నాగేశ్వరరావు కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఏసీ బిగించొద్దని, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హకుం జారీ చేశారు.
ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడికి వెళ్లగలమని.. కొంత సమయం కావాలని.. నాగమణి దంపతులు ఆయన్ను కోరారు. దీనిపై వారి మధ్య మరోమారు వాగ్వాదం జరిగింది. ఈ నెల 19వ తేదీ రాత్రి నాగేశ్వరరావు, వారి బంధువులు మద్యం మత్తులో వచ్చి సిద్దు, నాగమణి ఉంటున్న పోర్షన్‌లోకి చొరబడ్డారు. సిద్దుపై దాడికి దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నాగమణి జుట్టు పట్టుకుని విసురుగా బయటకు తోసేశారు. దీంతో ఆమె ఇనుప గ్రిల్‌ను గుద్దుకుని కింద పడిపోయింది. నాగేశ్వరరావు ఆ ఇద్దరినీ బయటే ఉంచేసి ఇంటికి తాళం వేసి.. ‘ఏం చేసుకుంటారో చేసుకోండ’ంటూ వెళ్లిపోయారు. యజమాని దాడి వల్ల నాగమణికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా వెంటనే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. గర్భిణి అని చూడకుండా తనపై, తన భర్తపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. తాము ఎవరికి ఓటు వేయాలో ఇంటి యజమానే నిర్ణయిస్తాడా? అంటూ ప్రశ్నిస్తోంది. ఆమె పొట్ట భాగంపై దెబ్బ తగిలిందని.. అబార్షన్ జరిగే ప్రమాదం 30 శాతం దాకా ఉందని వైద్యులు చెప్పారని నాగమణి తల్లి లత ఆందోళన వ్యక్తం చేశారు.