విజయవాడ ఈస్ట్ ఎమ్మల్యే గద్దె రామమోహన్, తన రోజు వారీ కార్యక్రమంలో భగంగా, కృష్ణలంక 22వ డివిజన్ నగర దర్శిని కార్యక్రమానికి తన కారులో బయలుదేరి వెళుతున్న సమయంలో అనుకోని సంఘటన ఎదురైంది. పటమట లంక స్క్రూ బ్రిడ్జి వంతెన వద్ద ఓ యువతి కాల్వలోకి దూకే ప్రయత్నంలో ఉండగా ఆయన గమనించారు. వెంటనే కారును వంతెన మీద ఆపించి, తన అనుచరులను ఆ యువతి వద్దకు పంపించి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆమెతో మాట్లాడి ఆమె కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
తన భర్త రోజు తాగి వచ్చి హింసిస్తున్నాడని, కుటుంబ కష్టాలు వెంటాడు తున్నాయని తెలపగా, ఆత్మహత్య చేసుకుంటే కష్టాలు తీరతాయా అంటూ ఆమెను మందలించి వారించారు. భర్తకు కౌన్సిలింగ్ ఇస్తామని, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యవద్దని ఆ మహిళకు చెప్పారు. పిల్లల భవిషత్తు గురించి ఆలోచించాలని, ఇలాంటి పనులతో సమస్యలు పరిష్కారం కావని ఆ మహిళతో చెప్పారు. తరువాత, సమీపంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి వారికి అప్పగించి జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్ళమని ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మధ్యాహ్నం సమయంలో తన కార్యాలయానికి వచ్చి కలవాలని యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు.