కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి భేటీ అయ్యారు. ఈయనతో పాటు పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ కైలాస్ విజయవర్గీస్ సైతం గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని గడ్కరీకి సంబంధించివారు చెబుతున్నారు. రానున్న ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర ఏమిటనే విషయంపై చర్చించారని తెలిపారు. గడ్కరీకి కీలకమైన పదవిని అప్పజెప్పే అవకాశముందని చెప్పారు. కైలాష్ విజయ వర్గీస్ భేటీ ముగించుకొని వెళ్లిపోగానే ఆరెస్సెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి గడ్కరీ ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీయేనే విజయం సాధిస్తుందని తేల్చి చెప్పడంతో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే వీరిరువురూ ఏఏ అంశాలను చర్చించుకున్నారనేది మాత్రం వెల్లడికాలేదు.
మరో పక్క గడ్కరీ వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీసాయి. ‘‘ఎగ్జిట్ పోల్స్ ‘అంతిమ తీర్పు’ కాదు కానీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో బీజేపీ తిరిగి అధికా రంలోకి వస్తుందని అవి సూచిస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వచ్చే శుక్రవారం విడుదల కానున్న బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ పోస్టర్ను గడ్కరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేక రులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అవే తుది ఫలితాల్లో ప్రతిబింబిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను పీఎం పదవి రేసులో లేనని ఇప్పటికి 20 నుంచి 50 సార్లు స్పష్టం చేశానని ఒక ప్రశ్నకు బదులుగా గడ్కరీ చెప్పారు.
మోదీనే మళ్లీ ప్రధాని అవుతారన్నారు. మహారాష్ట్రలో 2014లో మాదిరిగానే 23 సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ‘ఎగ్జిట్ పోల్స్ సందేశం’ పేరిట బ్లాగ్పోస్టులో రాశారు. ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వంపై మనం వాదులాడుకుంటూనే ఉండవచ్చు. కానీ, నిజం ఏమిటంటే.. అనేక ఎగ్జిట్ పోల్స్ ఒకే విషయం చెబుతున్నప్పుడు ఫలితాలు వాటికి అనుగుణంగానే ఉంటాయి’’ అని పేర్కొన్నారు. 2014 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో గెలిచినట్లు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ సీట్లు సాధిస్తుందని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు.