కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో చిక్కుకున్న ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతలోనే వాళ్ళ ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో సీసీబీ పోలీసులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే పసిగట్టిన గాలి జనార్దన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నారు. ఇదే కేసులో ఆయనకు సహకరించిన ఆలీఖాన్ అనే వ్యక్తికి బెంగళూరులో బెయిల్ దక్కింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2016౼17లో స్థాపించిన అంబిడెంట్ కంపెనీ వినియోగదారులను మోసాగించినట్లు గత జనవరిలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆ సంస్థపై పలుమార్లు దాడులు చేపట్టారు. ఈ కేసు నుంచి కాపాడాల్సిందిగా జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్‌ను అంబిడెంట్ సంస్థ ఛైర్మన్ ఫరీద్ కలిశారు. ఈడీ కేసుల నుంచి తప్పించేందుకు రూ.20.5కోట్ల డీల్ కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ.18.5కోట్లను బెంగళూరుకు చెందిన అంబికా జ్యూయలర్స్ సంస్థ యజమాని రమేశ్ కొఠారి ఖాతా నుంచి బళ్లారికి చెందిన రాజ్‌మహల్ జ్యూయలర్స్ యజమాని రమేశ్‌కి పంపించాడు. ఈ సొమ్ముతో 57 కేజీల బంగారం జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్‌కు అందజేశారు.
ఒప్పందంలో భాగంగా మిగిలిన సొమ్మును నగదు రూపంలో చేరవేశారు. అంబిడెంట్ సంస్థ వినియోగదారుల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో గత 10 రోజులుగా విచారణ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఫరీద్, రాజ్‌మహల్ జ్యూయలర్స్ యజమాని రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలను జప్తు చేశారు. పరారీలో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణా పోలీసుల సహకారంతో బెంగళూరు పోలీసులు జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. సెర్చ్ వారెంట్‌తో బెంగళూరు, బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి నివాసాల్లో మూడు సీసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.